మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ‘ఛావా’ టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘ఛావా’ బాక్సాఫీసు వద్ద కూడా మంచి రిజల్ట్స్ చుస్తోంది. థియేటర్‌కు వచ్చి సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో శంభాజీ మహారాజ్ గురించి చరిత్రలో పాఠ్య పుస్తకాల్లో ఎందుకు పెద్దగా ప్రస్తావన లేదనే ప్రశ్నలు ఎదురౌతున్నాయి.
నిజానికి చరిత్రలో ఛత్రపతి శివాజీకి వున్న చోటు మరో మరాఠా నాయకుడికి కనిపించదు. శివాజీ, శంభాజీ తర్వాత ఛత్రపతి రాజారామ్, షాహూ మహరాజ్, పీష్వాబాజీ రావు ,రఘునాథరావు ఇలా చాలా మంది మరాఠా వీరులు వున్నారు. వారి పాలన పోరాటాలు పెద్దగా తెరపైకి రాలేదు. సంజయ్ లీలా పీష్వాబాజీ రావు జీవితాన్ని తీశాడు కానీ ప్రేమకథకి పెద్దపీట వేశాడు. ఇప్పుడు శంభాజీ జీవితంపై’ఛావా’ గా వచ్చింది. దీంతో శంభాజీ చరిత్రపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఆయన చరిత్రని ఓ గ్లింప్స్ లా తెలియజేసే కథనం ఇది.
హిందూధర్మ రాజ్యంలో సర్వమత సమానత్వం. ఆసేతు హిమాచలం రెపరెపలాడే ధర్మ పతాకం. ఇదీ ఛత్రపతి శివాజీ కన్న కల. అది నిజం చేసే క్రమంలో ప్రాణాలు అర్పించిన ధర్మయోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ. శంభాజీ 16 ఏళ్ల నూనూగు మీసాల యవ్వనంలోనే ఖడ్గం ధరించి కదన రంగాన దూకాడు. రామనగర్‌లో మొగలాయి పాలకులపై భీకరంగా యుద్ధం చేసి శత్రువును తరిమి కొట్టాడు. 1675-76లో కొంకణతీరంలో పోర్చుగీసు మూకల్ని సముద్రం ఆవలికి తరిమాడు. కర్నాటకలో నిజామ్, మొగల్ సేనలకు తన వీరత్వాన్ని చవి చూపాడు.
సర్వమత సమానత్వంతో సువిశాల హిందూసామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మసూర్యుడు శివాజీ మహరాజ్ 1680లో అస్తమించాడు. దీన్నిసదవకాశంగా తీసుకుని, తన అపార సైన్యంతో హిందూరాజ్యాన్ని నామరూపాలు లేకుండా చెయ్యడానికి సంసిద్ధడయ్యాడు ఔరంగజేబు. ఆలయాలు కూల్చవలసిందిగా ఆదేశించాడు. ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు .ఈ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధభేరి మోగించాడు శంభాజీ మహారాజ్.
మధ్యభారతంలో బుందేల్ ప్రజలు ఔరంగజేబు మూకలపై తిరుగుబాటు చేశారు. మధురలోని జాట్లు,. రాజస్థాన్ కు చెందిన రాజపుత్రులు ముష్కర మూకల్ని ఖంగు తినిపించారు. శివాజీ వేసిన పునాదులు మరింత పటిష్టం చేస్తూ శంభాజీ మహారాజ్ ధర్మయుద్ధాలు సాగించాడు. దెబ్బకి దెబ్బతీస్తూ మొగలాయిలని మట్టుపెట్టాడు.
శంభాజీని ఔరంగజేబు చాలా తక్కువగా అంచనా వేశాడు. శివాజీ మరణంతో ఇక మరాఠాల రాజ్యం తనకే భోజ్యం అనుకున్నాడు.హిందూ సామ్రాజ్యాన్ని తాను శాశ్వతంగా అంతం చెయ్యగలనని విర్రవీగాడు. శంభాజీ మహారాజ్ తన నాయనమ్మ జిజియీబాయి వద్దపెరిగాడు. ఆమె శిక్షణలో నపరనరాప ధర్మాన్ని జీర్ణించుకున్నాడు. తండ్రి బాటలోనే తన సేనలను నడిపించాడు. మొగలాయిలను ముప్పతిప్పలు పెట్టాడు.
శంభాజీ ధాటికి తట్టుకోలేక ఔరంగజేబు 27 ఏళ్లపాటు ఉత్తర భారత దేశంలోకి అడుగు పెట్టలేక పోయాడు. అతి స్వల్ప కాలంలోనే శంభాజీ మొరుపు వీరుడిలా విజ్రుంభించాడు. కొంకణతీరంలో బలవంతపు మతమార్పిళ్లతో హిందూవులను హింసిస్తూన్న బుడత కీచుల్ని తరిమి కొట్టాడు. శంభాజీ పోరాటావల్లనే హిందూ ధర్మరాజ్యం వేళ్లూనుకుని నిలిచింది. అంతే కాదు అటు మహారాష్ట్ర నుండి ఉత్తరాది కీ , ఇటు దక్షిణాన ఆర్కాట్ వరకూ విస్తరించింది.
ఔరంగజేబు 8లక్షల మంది సైన్యంతో చేసిన దండయాత్రలను వీరోచితంగా తిప్పికొట్టాడు శంభాజీ. ఔరంగజేబు హిందూధర్మరాజ్యాన్ని నాశనం చెయ్యడానికి కక్షగట్టాడు. తన సమస్త బలగాలనూ ,యుద్ధాలను మరాఠాల మీదే కేంద్రీకరించాడు. అయినా శంభాజీ ధర్మపోరాటాలు కొనసాగించాడు. శంభాజీ యుద్ధాల కారణంగానే బుందేల్కండ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు మొగలాయిల బారిన పడకుండా మనుగడ సాగించాయి.
మొగల్ సైన్యాలు భారీ ఎత్తున నాసిక్ చేరుకున్నాయి. నాసిక్, నుండి చొరబడి తమ సామ్రాజ్యాన్ని విస్తరించే వ్యూహం వేశాయి. ఔరంగజేబు సేనలు ఐదేళ్ల పాటు ఎన్ని దొంగయుద్ధాలు చేసినా, ధర్మవీరులు వీటిన్నిటినీ తిప్పికొట్టారు. హిందూయోధుల ఎదురుదాడులతో మొగలాయిలకు చుక్కలు చూపించారు. తండ్రి నుండి నేర్చుకున్న గెరిల్లా పద్ధతులతో శత్రువులను ముప్పతిప్పలు పెట్టాడు శంభాజీ.
కొంకణతీరంలో పోర్చుగీసువారు హిందువులను బెదిరించి,డబ్బు ఎర చూపి క్రైస్తవంలోకి మారుస్తున్నారు. ఈ సమాచారం శంభాజీకి అందింది. శంభాజీ ఉగ్రుడయ్యాడు. బుడతకీచుల్ని యుద్ధంలో తరిమి కొట్టాడు. అలాగే దక్షిణ కొంకణ్ లో సంగమేశ్వర్, రాజపూర్, పన్హాలా, మల్కాపూర్, ప్రగఢ్, కోపాల్ , బహదూర్బండా, సిర్హోలి మొదలైన కోటలు నిలబెట్టుకోడానికి నిరంతరం మొగలాయిలతో పోరాడాడు.
మొగలాయిలు అనేకమంది హిందువులను హింసించి , వేధించి మతంమార్చారు. వారు తిరిగి హిందూమతంలోకి వస్తామన్నా బ్రాహ్మణులు అంగీకరించలేదు. వెంటనే స్పందించిన శంభాజీ అటువంటి వారు తిరిగి స్వీయ మతధర్మంలోకి రాడానికి తన ప్రభుత్వంలో ఏకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేశాడు. అలా రీకన్వర్షన్ కోసం మొట్టమొదటిగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేసిన ధర్మ ప్రభువు శంభాజీ.
1689 సంవత్సరం. కొంకణ ప్రాంతంలోని సంగమేశ్వర్ వద్ద ఒక గ్రామంలో శంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశం అయ్యాడు. శంభాజీ బావమరిది , యశోభాయి సోదరుడు గాణోజీ షిర్కీ అత్యంతహేయమైన ద్రోహానికి ఒడిగట్టాడు.ఈ సమాచారం కొన్నిరోజుల ముందుగానే మొగలాయిల కమాండర్ ముఖర్రబ్ ఖాన్ కు అందించాడు. మొగలాయిలతో చేతులు కలిపి పథకం ప్రకారం శంభాజీ మీద పెద్దఎత్తున దాడి చేశారు. ఈ యుద్ధంలో శంభాజీని, అతడి సలహాదారుడు కవికలశ్ నూ బందీలు గా పట్టుకున్నారు.
యుద్ధంలో ఓడిపోవడం వల్ల కాదు, గాణోజీ షిర్కీ ద్రోహం వల్ల శంభాజీ , ఆయన మంత్రి కవికలశ్ ఔరంగజేబు ఎదుట సంకెళ్లతోబందీలు గా నిలబడ్డారు. ఇస్లాం మతం స్వీకరిస్తే ప్రాణాలతో వదిలేస్తానన్నాడు ఔరంగజేబు. మొగలాయిల పాలబడకుండా దాచిన గుప్త నిధుల గురించి చెప్పమన్నాడు. తమ కళ్లు పీకినా, నాలుక కోసినా హిందువుగానే జీవిస్తామంటూ… హరహర మహాదేవ్ నినాదం చేశారు శంభాజీ కవి కలశ్. హిందూధర్మం అనాది. అది…అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుందని, తాము మరణించినా సత్యం ధర్మం జయిస్తాయని , హరహర మహాదేవ్ నినాదాలు చేస్తూ, శంభాజీ మహారాజ్, మంత్రి కవికలశ్ అమరులయ్యారు.