మద్యం ధరలు ఎక్కువైపోయి ..శానిటైజర్లు..మిధైల్ ఆల్కహాల్ తాగి…నిరుపేదలు ప్రాణాలు తీసుకుంటూండటంతో ఏపీ ప్రభుత్వం కాస్త దయతలిచింది. తక్కువ రేట్లు ఉన్న చీప్ లిక్కర్ రేటును మరింతగా తగ్గించింది. ఇప్పటికి ఏపీలో చీప్ లిక్కర్ రేటు..ప్రీమియం బ్రాండ్ల రేటు కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం స్వల్పంగా ఊరట కల్పించే ప్రయత్నం చేసింది. అయితే దీని వల్ల కోతపడే మొత్తానికి ఇతర బ్రాండ్లపై రేట్లు పెంచడ ద్వారా సమకూర్చుకుంది. ప్రస్తుతం 180 ఎంఎల్ బాటిల్ ధర రూ.120కి మించని బ్రాండ్లకు రూ.30 నుంచి , క్వార్టర్ ధర రూ.120 నుంచి రూ.150 వరకూ ఉన్న బ్రాండ్లకు.. రూ.30 నుంచి ఫుల్ బాటిల్‌పై 280 వరకూ తగ్గించింది.
క్వార్టర్ రూ.150 నుంచి 190 మధ్య ఉన్న బ్రాండ్ల ధరలు యధాతథంగా ఉంచారు. క్వార్టర్ రూ.190 నుంచి రూ.210 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లకు.. రూ.40 నుంచి రూ.300 వరకు పెంచారు. బీర్లు, రెడీ టు డ్రింక్‌పై మాత్రం రూ.30 తగ్గించారు. పెంచిన.. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలి కాలంలో మద్యం ధరలు పెరిగిపోవడం వల్ల శానిటైజర్లు తాగి పెద్ద ఎత్తున మందుబాబులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చీప్ లిక్కర్ తాగే పేదలు.. ప్రస్తుతం మద్యాన్ని కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు.
అందుకే వారు శానిటైజర్లు.. మిథైల్ ఆల్కహాల్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అదే సమయంలో… ఇతర రాష్ట్రాల నుంచి మద్యం పెద్ద ఎత్తున అక్రమ రవాణా అవుతోంది. అందుకే.. మద్యం ధరలు సవరించాలని ప్రభుత్వానికి ఎస్ఈబీ సిఫార్సు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం .. ధరల సవరణ నిర్ణయం తీసుకుంది. ధరల తగ్గిపు వల్ల మద్యం తాగేవారిని ప్రోత్సాహించినట్లుగా కాకుండా.. వారి ప్రాణాలను కాపాడటానికని.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.