భారత్లో కాల్ సెంటర్లు పెట్టుకుని.. మోసాలు చేయడాన్నే ఓ కంపెనీలు మాదిరిగా పెట్టుకున్న భారత సంతతి యువకులకు అమెరికా కోర్టు… జైలు శిక్ష విధించింది. కాల్ సెంటర్ల నుంచి కొంత మంది అమెరికన్లకు ఫోన్ చేసేవారు. తాము అమెరికా ఇన్కమ్ ట్యాక్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులమని బెదిరింపులకు దిగేవారు. ఫైన్ కట్టండి లేదంటే జైల్లో వేస్తామంటూ హెచ్చరికలు చేశారు. ఫ్రాక్సీ సర్వర్ల సాయంతో.. వీవోఐపీ టెక్నాలజీ వాడుతూ రోజూ వందల కొద్దీ కాల్స్ చేసేవారు. భయపడిన వారి వద్ద నుంచి .. భారీ మొత్తంలో డబ్బును అకౌంట్కు ట్రాన్స్ ఫర్ చేయించుకునేవారు. డబ్బు జమకాగానే అమెరికాలో ఉన్న తమ వ్యక్తులకు డబ్బు మళ్లించేవారు.
అనేక ఫిర్యాదులు రావడంతో.. భారత్లోని కాల్ సెంటర్లపై నిఘా పెట్టిన అమెరికా పోలీసులు.. రహస్యాన్ని చేధించారు. అహ్మదాబాద్, పుణె, ధానే తదితర ప్రాంతాల్లో ఉన్న కాల్ సెంటర్లలో 2012 నుంచి 2016 సంవత్సరాల మధ్య జరిగిన పలు మోసాల్లో పలువుర్ని నిందితుల్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అమెరికాలోని కోర్టు 21 మంది భారత సంతతి వ్యక్తులను దోషులుగా తేల్చి శిక్ష విధించింది. నేరాలను బట్టి 4ఏళ్ల నుంచి 20ఏళ్ల దాకా ఉన్నాయి. శిక్ష పడిన వారిలో చాలా మందని వారి శిక్షా కాలం పూర్తయిన తర్వాత భారత్కు పంపించేస్తారు. గతంలో కూడా ముగ్గురు భారతీయులకు ఈ కుంభకోణంలో శిక్ష పడింది.
సాధారణంగా నైజీరియన్ ముఠాలు ..భారతీయుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతూంటాయి. కానీ ఇండియన్ మోసగాళ్లు మాత్రం.. ఏకంగా అమెరికన్ యాసతో మాట్లాడగిలిగే వారిని ఉద్యోగులుగా పెట్టుకుని… అమెరికన్లనే బెదిరించి మోసం చేసే స్థాయి నేరాలు చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారం బయటపడినప్పుడు సంచలనం సృష్టించాయి. కానీ వారికి శిక్షలు పడతాయని ఎవరూ ఊహించలేదు. అమెరికా పోలీసులు.. న్యాయస్థానాలు…ఆషామాషీగా కేసును తీసుకోలేదు. వేగంగా నిందితులకు శిక్ష పడేలా చేశారు.