సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని ఇప్పుడు కేసు పెట్టారు. పంజాగుట్ట పోలీసులు పాల్ పై చీటింగ్ కేసు పెట్టేశారు.
కేఏ పాల్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల కోసం వెదుక్కుంటూ ఉంటారు. తన పార్టీ తరపున పోటీ చేసే వారు రావాలని ఆయన ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఆయన పార్టీ ఫండ్ లక్ష అయినా ఇస్తారేమోనని చెప్పి కొంత మంది ఆశగా వచ్చి బీఫామ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ వారు పోటీ చేస్తారో లేదో కూడా ఎవరికీ తెలియదు.
కొసమెరుపేమిటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది నవంబర్లోనే ముగిశాయి. ఆ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలేదు. ఆయన పార్టీ ఇన్ యాక్టివ్ గా మారడంతో.. ఈసీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కామన్ సింబల్ ఇవ్వాలంటూ కేఏ పాల్ రచ్చ చేశారు. అయితే చివరికి ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. నోటాకు వేయాలని ప్రచారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థుల్ని నిలబెట్టలేకపోయారు. ఏపీలో కూడా తాను ఒక్కరే నిలబడ్డారు. పలువురుకి బీఫాంలు ఇచ్చినప్పటికీ వారెవరో ఎవరికీ తెలియదు.
పాల్ పార్టీ టిక్కెట్ కోసం యాభై లక్షలు ఇస్తే.. అది పాల్ తప్పు కాదని.. ఖచ్చితంగా ఇచ్చిన వాడి తప్పేనన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.