ప్రముఖ నిర్మాణ సంస్థలు, హీరోలు, దర్శకుల పేర్లు చెప్పి – ఆడిషన్స్ చేయడం, తద్వారా సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు మాయ మాటలు చెప్పి మోసం చేయడం… ఇవన్నీ ఫిల్మ్ నగర్ లో మామూలైపోయాయి. ఇప్పుడు విజయ్ దేవర కొండ పేరుని కేడీ బ్యాచ్ వాడుకొంటోంది. విజయ్ దేవరకొండ నిర్మాతగా రాబోతున్న కొత్త సినిమాలో నటీనటులు కావాలంటూ ఓ బ్యాచ్ ఆడిషన్స్ నిర్వహిస్తోంది. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయ్ దేవరకొండ సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి తాము ఎలాంటి ఆడిషన్స్ నిర్వహించడం లేదని, అలా తమ పేరు చెప్పి ఆడిషన్స్ చేస్తున్నవాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయ్ దేవరకొండ టీమ్ హెచ్చరిస్తోంది. ప్రస్తుతానికి అలాంటి ముఠాని గుర్తించి, వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు.