పదేళ్ల కిందట 2007లో విశాఖ జిల్లా బంగారమ్మపేటలో బీచ్ మినరల్స్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ఇప్పుడు వైసీపీ మాజీ ఎంఎల్ఎ చెంగల వెంకట్రావును వెంటాడింది. మత్య్యకారుల ఉపాధికి చేటు కలిగించే ఆ కంపెనీ వద్దని నాడు తెలుగుదేశంలో వున్న చెంగల ఉద్యమం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళనను వ్యతిరేకించింది.అప్పుడు జరిగిన పరస్పర ఘర్షణలో ఒక కొండ అనే మత్య్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు కారణం చెంగలేనంటూ ఆయన కుటుంబ సభ్యులు కేసు పెట్టగా పదేళ్లు విచారణ జరిగింది. ఎట్టకేలకు ఈ రోజు అనకాపల్లి హైకోర్టు ఆయనతో సహా పదిహేను మందికి యావజ్జీవ శిక్ష మరికొందరికి రెండేళ్లు ఖైదు విధించింది. ఇప్పుడు అధికారంలో వున్న తెలుగుదేశం ఉద్యమాలు ఆందోళనలను వ్యతిరేకిస్తున్నది. పైగా పార్టీ మారిన చెంగలకు శిక్ష పడితే అది తన సమస్యగా చూడదు కూడా. వైసీపీయే ఆయనతో నిలబడాల్సి వుంటుంది.
ప్రత్యేకించి చెంగల వెంకట్రావ్ సమరసింహారెడ్డి వంటి హిట్ చిత్ర నిర్మాతగా ఎక్కువ పరిచితులు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో నరసింహుడు అనే చిత్రం కూడా తీశారు. అప్పుడే ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి హుసేన్‌సాగర్‌లో దూకితే ఎవరో రక్షించారు.
నరసింహుడు చిత్ర కథ కోసం సమరసింహారెడ్డి రాసిన విజయేంద్ర ప్రసాద్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుని వద్దనుకోవడం కూడా మరో కేసు నడిచింది. తన దగ్గర ఆయన 30 లక్షలు తీసుకున్నారని చెంగల కేసు వేశారు. అయితే తర్వాత కోర్టు ఆ కేసు కొట్టి వేసింది. చెంగల ఫిర్యాదుకు ఆధారాలు లేవని చెప్పింది. ఇలా ఆయన అనేక ఎదురుదెబ్బలు తిన్న వ్యక్తిగా చెప్పాలి.ఎలాగైనా పై కోర్టులకు వెళ్లడం అనివార్యమే గాని రాజకీయాల్లో వచ్చే మార్పులు చేర్పుల ప్రభావం తెలుసుకోవడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణగా వుంటుంది.