చెన్నై, బెంగళూరుల్లో ఓ మాదిరి తుపాన్ కారణంగా ఏర్పడిన పరిస్థితులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరు మొత్తం స్తంభించిపోగా.. చెన్నై వాసులు అయితే తమ కార్లు వాహనాలను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. చెన్నైలోని అన్నిఫ్లైవర్లు పార్కింగ్ లాట్లుగా మారిపోయాయి. నీటిలో మునిగిపోతే లక్షల్లో నష్టం వస్తుంది. గతంలో వచ్చిన వరదలతో వారికి జరిగిన నష్టానికి ఇంకా ఈఎంఐలు కట్టుకుంటూనే ఉంటారు.అందుకే ఈ సారి జాగ్రత్త పడ్డారు.
చెన్నై, బెంగళూరుకు ఓ మాదిరి వర్షాలతోనే ఇంత వరద రావడానికి కారణం డ్రైనేజీ వ్యవస్థ.. చెరువులు వంటివి నాశనం కావడమే. చెన్నైలో మెట్రో నిర్మాణం పేరుతో కాలువల్ని కుంచించేశారు. ఫలితంగా చెన్నై ఇబ్బంది పడుతోంది. బెంగళూరులో చెరువుల్ని కూడా ఆక్రమించేశారు. పొల్యూషన్ తో నింపేశారు. అక్కడా ఇబ్బంది పడుతుంది. హైదారాబాద్ లో ఆ మాదిరి వర్షాలు వస్తే అదే పరిస్థితి వస్తుంది. నాలుగేళ్ల కిందట రెండు గంటల జడివానతో సగం హైదరాబాద్లో విధ్వంసం జరిగింది.
ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత భయంకరంగా ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. చెరువుల్ని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించడంతో పాటు నీరంతా మూసి నది ద్వారా బయటకు పోయేలా ప్రక్షాళన ప్రారంభించారు. కానీ వాటికి అనేక సమస్యలు, సవాళ్లు ఎదురొస్తున్నాయి. వాటిని అనుకున్నట్లుగా పూర్తి చేస్తేనే వరదలు వచ్చినా నీరు నిలువని ఎకోసిస్టమ్ ఏర్పాటవుతుంది. లేకపోతే హైదరాబాదీలు కూడా వరదల వచ్చినప్పుడు కార్లను, బైకుల్ని ఎక్కడో పార్క్ చేసుకుని తాము బిక్కు బిక్కుమంటూ గడపాల్సి రావొచ్చు.