చెన్నైలోని ప్రస్తుత వరద బీభత్స దుస్థితికి ప్రధానకారణం ఏమిటన్నది నిశితంగా ఆలోచిస్తే, దీన్ని ప్రకృతి వైపరీత్యమని పిలవడంకంటే, రాజకీయ నాయకులు, మోసగాళ్లు, నోరుమెదపని ఇంజనీర్ల విచ్చలవిడితనమే కారణమని చెప్పాలి. మహానగరాన్నివీళ్లంతా కలిసి కేవలం గంటల వ్యవధిలో నిలువునా ముంచేశారు. అంతాచేసి, చివరకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. `ఇంతటి భారీ వర్షం పడుతున్నప్పుడు నష్టం తీవ్రస్థాయిలోనే ఉంటుంది…తప్పదు’ అంటూ తప్పించుకునే రాజకీయ నాయకులను నిలదీసి అడిగే సమయం ఇది. పాలనాపరమైన పొరపాట్లను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి చెప్పేమాటలే ఇవి. చెన్నై ముంపులో తమతప్పులేదనీ, ఇది `యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటూ తప్పించుకుంటున్నారు.
1. చెన్నై చుట్టుపక్కల సారవంతమైన పంటపొలాలు తగ్గిపోయాయి. నగర శివార్లలో ఐదువేల ఎకరాల మేరకు చిత్తడినేలలుండేవి. పల్లికరణై వద్ద 250 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం ఒకప్పుడు ఉండేది. వాననీటినీ, వరదనీటిని ఈ సారవంతమైన భూములు బాగాపీల్చుకునేవి. నగరం పెరుగుతున్నకొద్దీ ఈ ప్రాంతం కుచించుకుపోతున్నది. పదేళ్ల క్రిందట ఇది 50 చదరపు కిలోమీటర్లుగా ఉండేది. కానీ ఇప్పుడు మరీ తగ్గిపోయింది. కేవలం 4.3 చదరపు కిలోమీటర్ల మేరకు మాత్రమే నీటిని పీల్చే చిత్తడినేల మిగిలింది. పంటకాలవల్లో నానారకాల చెత్త పేరుకుపోతున్నది. టన్నులకొద్దీ చెత్తపడటంతో వరదనీటి ప్రవాహం సాఫీగా సాగిపోకుండా పక్కనే ఉన్న కాలనీలవైపుకు మళ్లుతోంది.
2. వాననీటిని పీల్చే శక్తివంతమైన భూముల్లో బడా సంస్థలు వెలుస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో National Institute of Ocean Technology (NIOT) కూడా ఉంది. ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు, నీటి ప్రవాహాలను నియంత్రించేందుకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అధ్యయనం చేసే ఈ సంస్థే, నీటిని పీల్చే చిత్తడినేలను మ్రింగేయడం గమనార్హం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఆస్పత్రులు, మల్టీనేషనల్ కంపెనీలు ఈ చిత్తడినేలల్లోనే వెలిశాయి.
3. చిత్తడినేలను ప్రభుత్వం ఐటీ కారిడార్ల కోసం వదిలేసి ఘనకార్యం చేసినట్లు చాటింపు వేసుకుంది. జోరువానలు పడినప్పుడు నీరు ఎక్కడిపోవాలో తేలియక, చివరకు ఈ ఐటీ కంపెనీల్లోకే వెళ్ళే పరిస్థితి తలెత్తింది. ఈ తప్పు ఎవరదంటారు? ఒక్క ఐటీ కంపెనీలేకాదు, ఆటో కారిడార్ లాంటి వాటికోసం సెజ్ లను ధారాదత్తం చేశారు. ఈ ప్రాజెక్టుల అవగాహనపత్రాలపై సంతకాలు చేసేసమయంలో నిపుణులు (ఇంజనీర్లు, టౌన్ ప్లానర్లు) నోరువిప్పలేదు. రాజకీయాలు నాట్యమాడాయి. మరి ఇప్పుడు వరద కరాళనృత్యం చేస్తుంటే నగరవాసులు లబోదిబోమనాల్సి వస్తున్నది.
4. చెన్నై నగరంలో వరదముంపు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ తప్పుడు ప్రణాళికలవల్ల ఏర్పడినవే. జాతీయ రహదారులు కలిపే బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల వరదనీరు ఎగతన్ని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి.
5. వరదనీటిని తనలో దాచుకునే కుంటలు, చెరువులు కొన్ని అదృశ్యమయ్యాయి. మిగిలినవి కూడా నామమాత్రంగా ఉన్నాయి. చెన్నైలో 600 చెరువులుండేవట. కానీ పట్టుమని పదికూడా లేకుండా చేశారు. టౌన్ ప్లానింగ్ లో లోపాలు, ప్రభుత్వం అడ్డదిడ్డంగా అనుమతులు ఇవ్వడంతో చెరువులు, కుంటల్లో కాలనీలు వెలిశాయి. అక్కడ రోడ్లు పడ్డాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపెక్కింది. చివరకు వరదనీరు ఇంకిపోయే మార్గమే కనుమరుగైంది. వరదనీటిని సముద్రంవైపు మళ్ళించే కాలవులు బక్కచిక్కిపోయాయి. వాటి పరీవాహక ప్రాంతమంతా కాలనీలు వెలిశాయి. చెత్తాచెదారలతో వరదనీరు అడుగు ముందుకువెళ్ళే పరిస్థితి లేదు. బకింగ్ హామ్ కాలువ ఒకప్పుడు 25మీటర్ల వెడల్పుతో ఉండేది. కానీ అదిప్పుడు పట్టుమని పదిమీటర్ల వెడల్పు కూడాలేదు. ఉన్నకాస్తా టన్నులకొద్దీ చెత్తతో నిండిపోయింది. పైగా, ఎంఆర్ టిఎస్ రైల్వే స్టేషన్ల నిర్మాణానికీ ఈ కాలువ పరీవాహక ప్రాంతమే కావాల్సివచ్చింది.
6. చెన్నై మహానగరంలో వరద నియంత్రణ వ్యవస్థ లేదన్న సంగతి పాలకులకూ, అధికారులకు తెలియదనుకోవడం తప్పు. వరదనీరు ఎందుకు ఇంకిపోవడంలేదో, ఏంచేస్తే పరిస్థితి చక్కబడుతుందో చెప్పడానికి వారివద్ద పక్కా ప్రణాళికలు గణాంక వివరాలతోసహా చాలానే ఉన్నాయి. జలనియంత్రణ సదస్సులు జరిగినప్పుడల్లా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐదేళ్ల క్రిందట చెన్నై మెట్రొపాలిటిన్ డెవెలప్ మెంట్ అథారిటీ సదస్సు ఏర్పాటుచేసినప్పుడు తప్పులన్నీ ఆరబోశారు. కానీ- `నీరు పల్లమెరుగు’ అన్న సూత్రాన్ని అటకెక్కించారు.
7. సముద్రంవైపు నుంచి సునామీ వంటి ముప్పులను ఎదుర్కుంటున్న చెన్నై నగరం అంతర్గతంగా సరైన జలవ్యవస్థ లేకపోవడంతో అంతకంటే బీభత్సమైన ముప్పును ఎదుర్కోవాల్సి వస్తున్నది. నదులు, చెరువులు, పంటకాలవలతో కళకళలాడే చెన్నై నగరం చివరకు కన్నీటి వరదనగరంగా మారిపోయింది.
8. వరదనీరు వెళ్ళే కాలవలను, నదులను కాపాడాల్సిన అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై మోసగాళ్లుగా మారిపోయి చివరకు చెన్నైని నిలువునా ముంచారు. డ్రైనేజ్ వ్యవస్థ కట్టుదిట్టంగా లేకపోతే నగరం ఎలాంటి దారుణాలను చవిచూడాల్సి వస్తుందో చెప్పడానికి చెన్నై ఓ ఉదాహరణగా నిలిచింది.
9. ప్రకృతికి విరుద్ధంగా చేయాల్సిందంతాచేసి చివరకు ప్రకృతి వైపరీత్యంగా మాట్లాడటం విడ్డూరం. ఇలాంటి పాలకులు, అధికారులు స్మార్ట్ సిటీలను నిర్మిస్తారంటే ప్రజలు ఎలా నమ్ముతారు ?
10. వాతావరణంలో వచ్చే పెనుమార్పులను తట్టుకునేలా నగరాలను సరిదిద్దకపోతే చెన్నై వరదల్లాంటి సంఘటనలు పలుచోట్ల సంభవించవచ్చు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మిస్తామంటున్నారు. వారికి చెన్నై 2015 వరద సంఘటన నిజంగా ఓ హెచ్చరిక.
– కణ్వస