ఐపీఎల్ లో అత్యంత బలమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. సూపర్ స్టార్ల జట్టది. పైగా ధోనీ లాంటి అత్యుత్తమ కెప్టెన్ నాయకత్వం వహిస్తున్నాడు. అందుకే నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా ఆవిర్భవించింది. అయితే ఈ సీజన్ చెన్నైకి చాలా క్లిష్టమైన సీజన్ గా అభివర్ణించారు క్రీడా పండితులు. ఎందుకంటే 2020లో ఆ జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లకు గానూ కేవలం ఆరింటిలో గెలిచి – ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. సూపర్ స్టార్లు అనదగినవాళ్లెవరూ రాణించలేదు. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై కనీసం ప్లే ఆఫ్ చేరకుండా – ఇంటికెళ్లిపోవడం అదే ప్రధమం. పైగా జట్టులో వయసు మళ్లిన ఆటగాళ్ల సంఖ్య ఎక్కువైంది. వాళ్లెవరూ అంచనాలకు తగినట్టు రాణించలేదు. ధోనీ సైతం మెరుపులు మెరిపించలేకపోయాడు. ఎప్పుడూ లేనిది.. వికెట్ల మధ్య పరిగెట్టడంలోనూ అలసత్వం చూపించాడు. దాంతో చెన్నై పని అయిపోయిందని భావించారంతా. 2021లో భారీ మార్పులు తప్పవని అనుకున్నారు.
కానీ ధోనీ తన జట్టుపై నమ్మకాన్ని ఉంచాడు. మార్చింది ఆటగాళ్లని కాదు. వ్యూహాన్ని. 2020లో చేసిన తప్పులేవీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు. అనుభవాన్ని, యువరక్తాన్ని సమానంగా నమ్మాడు. సమానమైన అవకాశాలిచ్చాడు. అందుకే 2021 విజేతగా చెన్నై ఆవిర్భవించింది. బ్యాట్స్‌మెన్ గా ధోనీ ఈ సీజన్లో మెరుపులు మెరిపించలేదు. కానీ కెప్టెన్ గా మాత్రం సక్సెస్ అయ్యాడు. బౌలర్లని మార్చిన విధానం, ఫీల్డింగ్ మోహరించిన పద్ధతి, మైదానంలో సహనం కోల్పోనివ్వకుండా తోటి ఆటగాళ్లని నడిపించడం – ఇవన్నీ పాత ధోనీని గుర్తు చేశాయి. ముఖ్యంగా ఢిల్లీతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి, తన జట్టుని ఫైనల్ కి చేర్చాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు గైక్వాడ్. రెండో స్థానంలో డూప్లిసీస్ ఉన్నాడు. ఇద్దరూ చెన్నై ఆటగాళ్లే. గత సీజన్ లో పవర్ ప్లేలో పెద్దగా పరుగులు చేయలేదు చెన్నై. దాంతో.. చిన్నపాటి లక్ష్యాల్ని కూడా ఛేదించలేకపోయింది. ఈసారి ఆ తప్పు చేయలేదు. గైక్వాడ్, డూప్లెసిస్ జంట.. తొలి వికెట్ కి మెరుగైన భాగస్వామ్యాల్ని అందించింది. రైనా రాణించకపోయినా ఆ స్థానంలో వచ్చిన ఊతప్ప కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. మెయిన్ అలీని కూడా ధోనీ సరిగానే వాడుకున్నాడు. ఇక జడేజా ఈ సీజన్లో తన ఆల్ రౌండర్ నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నాడు, గతంతో పోలిస్తే… ఈసారి చెన్నై ఫీల్డింగ్ మరింత పటిష్టంగా మారింది. ఫైనల్ లో ఆ జట్టు ఆటగాళ్లు అందుకున్న క్యాచ్‌లే అందుకు నిదర్శనం. వయసైపోయిందనుకున్న బ్రావో కూడా…. ఈ ఐపీఎల్ లో తన సత్తా చాటాడు. 2020లో కనిపించింది ఈ జట్టేనా? అని ఆశ్చర్యపోయేలా .. 2021 జట్టుని తీర్చిదిద్దాడు ధోని. అందుకే 4వ సారి ఐపీఎల్ కప్పుని ముద్దాడగలిగాడు. శభాష్.. చెన్నై సూపర్ కింగ్స్.