చెన్నై వరద కష్టాలు అన్నీఇన్నికావు. ఎంత సాయం చేస్తే వారి జీవితాలు గాడిలో పడతాయో తెలియని పరిస్థితి. చెన్నైలో వరద పోటెత్తినప్పుడు మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో ఎన్నో ఫోటోలు, వీడియోలు కనిపించాయి. అలా ట్విట్టర్ లో కనిపించిన ఫోటో ఇది. హరీష్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఎకౌంట్ లో దీన్ని పోస్ట్ చేస్తే, సినీనటుడు, నిర్మాత రానా దగ్గుబాటి రీట్వీట్ చేశారు. నిజజీవితంలో శివగామిలాంటి వాళ్లు ఎంతో మంది ఉంటారని నిరూపించిన చిత్రమిది.
ఈ ఫోటోలని వృద్ధునికి కుట్టుమిషనే జీవనాధారం. అన్నంపెట్టే కుట్టుమిషన్ వరదనీటిలో కొట్టుకుపోతుంటే, చూడలేక దాన్ని తన భుజానవేసుకుని పూర్తిగా నీటిలో మునిగిపోకుండా ఇలా రక్షించుకుంటూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో మెడలోతు నీళ్లలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి వెళుతున్నాడీ వృద్ధుడు. ప్రకృతి ఎంతగా ఎదురుతిరిగినా అతని కళ్లలో నిరాశ తొంగిచూడటంలేదు. మోములో ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదు.
ప్రకృతి వైపరీత్యం విరుచుకుపడినప్పుడు తననుతాను రక్షించుకోవడంతోపాటు, తనను ఇంతకాలంగా కాపాడుతూ వస్తున్న జీవనాధారాన్ని (ఇది మిషన్ కావచ్చు, లేదా జంతువు కావచ్చు, మరొకటి కావచ్చు) కూడా రక్షించాలన్న మంచి సందేశం ఈ ఫోటోలో కనిపిస్తోంది. అందుకే ఇది ఇక్కడ చోటుచేసుకుంది.
(ఈ పోటో అందించిన వారికి కృతజ్ఞతలు)