కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. గత ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి సంచలన విజయం సాధించిన నేత. అసలు టీఆర్ఎస్కు గెలుపు అవకాశాలే లేవనుకున్న పార్లమెంట్ స్థానం చేవెళ్లే. ఎందుకంటే.. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి… అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు చోట్ల.. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్…వీటిలో తాండూర్ మినహా.. మిగతా మూడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలు. తాండూరులో టీడీపీ నుంచి వెళ్లిన మహేందర్ రెడ్డి.. టీఆర్ఎస్కు అండగా ఉన్నారు. ఆ ఒక్కటి తప్ప… ఇక ఏ సమీకరణం కలసి రాని పరిస్థితి. అయినప్పటికీ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. దీనికి కారణం… టీఆర్ఎస్ బలం కన్నా… ఆయన బ్యాక్‌గ్రౌండే. రంగారెడ్డి జిల్లా పేరు ఏర్పడింది.. ఆయన పూర్వీకులైన కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదే. ఆ లెగసీ కూడా ఆయనకు ఉపయోగపడింది. చివరిగా విజయం వరించింది.
విశ్వేశ్వర్ రెడ్డి.. సంప్రదాయ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఎలా పడితే అలా మాట్లాడరు. ఎదైనా… పద్దతిగా పార్లమెంటరీ పద్దతిలోనే చేసుకోవాలనుకుంటారు. కానీ… ఆయనతో పాటు జిల్లాలో టీఆర్ఎస్ తరపున చక్రం తిప్పుతున్న పట్నం మహేందర్ రెడ్డిది మాత్రం.. భిన్నమైన రాజకీయం. ఆయన తరహా రాజకీయాలే టీఆర్ఎస్కు అవసరం . ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించడం… వినని వాళ్లను కేసులతో బెదిరించడం.. సహా.. చాలా చాలా వ్యవహారాలు మహేందర్ రెడ్డి దూకుడుగా చేశారు. ఇప్పుడు రేవంత్ ను ఢీకొట్టడానికి ఆయన తమ్ముడ్నే ఎంచుకున్నారు. ఈ వ్యవహారాలన్నింటితో… విశ్వేశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ అధినాయకత్వం పట్టించుకోవడం మానేసింది. ఆయనకు కనీస అధికారాలు కానీ.. ప్రాధాన్యత కానీ.. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో లేకుండా పోయింది. నిమిత్త మాత్రుడిగా ఉండటం ఇష్టం లేక ఆయన రాజీనామా చేసేశారు.
విశ్వేశ్వర్ రెడ్డి క్లీన్ ఇమేజ్ ఉన్న నేత. ఆయన రాజీకనామా వ్యవహారం కచ్చితంగా.. తెలంగాణ రాష్ట్ర సమితికి మైసన్ అవుతుంది. ఆయన రాసిన మూడు పేజీల లేఖలో ఎక్కడా ఆరోపణలు లేవు. కానీ టీఆర్ఎస్ అధినాయకత్వానికి సూటిగా తగిలేలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ వ్యతేరేకులకు అందలం ఎక్కించడం దగ్గర్నుంచి కార్యకర్తలను కనీసం పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వరకూ.. టీఆర్ఎస్లో ఉన్న అన్ని అవలక్షణాలను… చాలా పద్దతిగా ఏకరవు పెట్టారు. నిజానికి అవన్నీ.. టీఆర్ఎస్ కు ఇప్పుడు మైనస్లుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎందుకు ఓటేయకూడదో… విపక్షాలు ఏ అంశాలనైతే.. చెబుతున్నాయో… వాటినే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బయటకు చెప్పారు. ఇక మీడియా సమావేశంలో ఏం చెబుతారో కానీ.. ఇప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన ఇరవై మూడో తేదీన.. మేడ్చల్‌కు రానున్న సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మొత్తానికి టీఆర్ఎస్ ఓడిపోబోతోందని.. అందుకే నేతలందరూ తలోదారి చూసుకుంటున్నారన్న విశ్లేషణకు కొండా విశ్వేశ్వరరెడ్డి మరింత బలం ఇచ్చారు.