వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో వ్యక్తుల ప్రాధాన్యతలను క్రమంగా మారుస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని నేరుగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా తగ్గిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలపై ఎక్కువగా బాధ్యతలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఇతర నియామకాలు చేససినా అవన్నీ రికార్డు కోసమే కానీ.. ఇక నుంచి జగన్ తరపున పార్టీలో పెత్తనం చేసేది వీరేనని సంకేతాలు పంపుతున్నారు.
జగన్ త్వరలో లండన్ వెళ్లబోతున్నారు. ఆ సమయంలో పార్టీ వ్యవహారాలను చెవిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి చూస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కీలక నేతలందరికీ కేసుల ఉచ్చు ఉంటుంది. అందుకే… వారు ఇప్పుడల్లా యాక్టివ్ అయ్యే అవకాశం లేదు. పైగా సజ్జలను దూరం చేసుకోవాలన్న డిమాండ్లు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. కానీ విజయసాయిరెడ్డిని తిట్టి పంపేసినంత సులభంగా సజ్జలను జగన్ దూరం పెట్టలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఆయన కుమారుడిని సోషల్ మీడియా నుంచి దూరం పెట్టగలిగారు.
సజ్జల గత ఐదేళ్ల కాలంలో పార్టీపై పట్టు సాధించారు. ఆయనను అంత వేగంగా వదిలించుకోవడం సాధ్యం కాదని జగన్ కూ తెలుసు. అందుకే మెల్లగా పార్టీలో ఇతరుల పాత్రను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తనకు లాయల్ గా ఉంటారని అంచనాకు వచ్చిన శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి చెబితే ఇక జగన్ చెప్పినట్లే అన్న పరిస్థితి తీసుకు వస్తున్నారు. మరి ఈ మార్పులు ఎంత వరకూ ఫలితం ఇస్తాయో చూడాల్సి ఉంది.