ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పండిన పంటల్ని అమ్ముకోలేకపోతున్నారు. నిన్నామొన్నటి దాకా పంటలు పండించుకోవడం ఓ చాలెంజ్ అయితే.. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అమ్ముకోవడం ఓ చాలెంజ్. ప్రభుత్వమే అన్ని రకాల పంటలు కొనాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి కానీ .. ఎప్పుడూ కొనే ధాన్యం వంటి వాటినే కొంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… పళ్లు, కాయలు, కూరగాయలు పండించే వారందరి దగ్గర కొనేస్తున్నారు. అయితే ప్రభుత్వం డబ్బులతో కాదు.. తన డబ్బులతో. కొని.. నియోజకవర్గ ప్రజలకు.. పంచేస్తున్నారు. దాదాపుగా యాభై లక్షలకుపైగా ఖర్చు పెట్టి.. తన నియోజకవర్గంలో పండించి.. అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్న వారి దగ్గర నుంచి పండ్లను కొన్నారు చెవిరెడ్డి. వాటిని ఇమ్యూనిటీ పెంచుకోవాలని చెబుతూ.. ప్రజలకు పంచేస్తున్నారు.
ఇదే మొదటి సారి కాదు.. కొద్ది రోజుల కిందట.. దాదాపు ఇరవై వేల మందికి… నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రెండు కోట్ల వరకూ ఖర్చు చేసినట్లుగా చెప్పుకున్నారు. అంత కంటే ఎక్కువే ఖర్చు అయి ఉంటుందని.. ఆయన పంపిణీని చూసిన వారు అంచనా వేస్తున్నారు. లాక్ డౌన్ పొడిగింపుతో మరో విడత నిత్యావసరాలు పంపణీ చేయడానికి ఆయన ఆలోచిస్తున్నారు. ఈ లోపు పండ్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఏపీ సర్కార్ కూడా.. అరటి, బత్తాయి, ద్రాక్ష వంటి పండ్లను కొని ప్రజలకు పంపిణి చేస్తే.. రైతులు నష్టపోకుండా ఉండేవారు.. తక్కువ ఖర్చుతోనే కావాల్సినంత పేరు వచ్చేదన్న అభిప్రాయం.. వైసీపీ నేతల్లోనే వచ్చింది.
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వివాదాస్పద ఎమ్మెల్యే. ఆయన వ్యాపారాలేంటో.. చాలా మందికి తెలియదు కానీ.. ఆయన చేతికి ఎముక ఉండదని మాత్రం ఆయన చేసే పనులు చేసే సాయాలను బట్టి చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల నేతలు చేసిన ఖర్చును .. పంచిన డబ్బులను చూసిన అక్కడి జనం..గెలిచిన ఎవరైనా సరే.. ఐదేళ్ల పాటు.. సంపాదించుకునే పనిలో ఉంటారనే అనుకున్నారు. అంతగా ఖర్చు పెట్టారు. కానీ.. రెండో సారి గెలిచిన చెవిరెడ్డి మాత్రం… ఎలక్షన్ల స్థాయి ఖర్చును… ఆ తర్వాత ఎక్కడా తగ్గించలేదు. అలా కొనసాగిస్తూనే ఉన్నారు. డబ్బు ఎలా సంపాదించినా.. పేదల కోసం ఆయన వెనక్కి తగ్గకుండా ఖర్చు చేయడం చాలా మంది మెచ్చుకునేలా చేస్తోంది.