తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ. అలాంటి పదవి కోసం ఎంత తీవ్ర ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో లోక్ సభ టిక్కెట్ నిరాకరించడంతో వైవీ సుబ్బారెడ్డిని బుజ్జగించడానికి ఆధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పోస్టును ఇచ్చారు సీఎం జగన్. తర్వాత కొనసాగించారు. వచ్చే నెల పదో తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. కొత్త టీటీడీ బోర్డును నియమించాల్సి ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్ని కీలక పదవులు ఒకే సామాజికవర్గానికి ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు అయినా ఓ బీసీ నేతకు ఇద్దామని జగన్ రెడ్డి భావిస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి పేరున లీక్ చేశారు. ఆయన కూడా పడిన కష్టానికి ఓ ఆరు నెలలయినా ప్రతిఫలం దక్కుతుందేమో అనుకున్నారు. కానీ ఇద్దరు వైసీపీ సీనియర్ రెడ్డి నేతలు ఆయన ఆశలకు గండి కొడుతున్నారు. ఒకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరొకరు భూమన కరుణాకర్ రెడ్డి
చెవిరెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి తుడా ఛైర్మన్ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగతున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. టీటీడీ చైర్మన్ గా చేయాలనేది చెవిరెడ్డి లక్ష్యం. అందకే సీఎం జగన్ మోహన్ రెడ్డికి తనకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదు. ఆయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీటీడీ చైర్మన్ గా చేసి రిటైర్ అవుతానని అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గతంలో భూమన ఓ సారి టీటీడీ చైర్మన్ గా చేశారు.
బీసీలు ఎప్పుడూ వైసీపీ రెడ్డి నేతల చేతుల్లో వెనుకబడుతూనే ఉన్నారని..చివరికి గురజాల జంగా కృష్ణమూర్తి టిక్కెట్ ను నర్సరావుపేట నుంచి వచ్చిన రెడ్డి నేతకు కేటాయించారని.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోని ఎక్కువ మంది నమ్ముతున్నారు.