చెవిరెడ్డి పెద్ద పారిశ్రామివేత్త కాదు. వందల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలను నడపడం లేదు. కానీ ఆయన నియోజవకర్గ ప్రజలకు మాత్రం… కోట్లకు కోట్లు సాయం చేయడంలో ఇంచ్ కూడా వెనుకడుగు వేయరు. తాజాగా చెవిరెడ్డి ఐదున్నర కోట్లు ఖర్చు పెట్టి 25 వేల కుటుంబాలకు బ్రాండెడ్ దుస్తులు పంపిణీ చేస్తున్నారు. కొత్త ఏడాది, సంక్రాంతి సందర్భంగా బ్రాండెడ్ దుస్తులతో పాటు, తిరుమల లడ్డు, క్యాలెండర్, స్వీట్ బాక్సు, బ్యాగ్‌తో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికీ పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. దీని కోసం ఐదున్నర కోట్లు వెచ్చిస్తున్నారు. చెవిరెడ్డి ఇలా ఖర్చు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఆయన ఎన్నికలు ముగియగానే… కౌంటింగ్ జరగక ముందే.. తన గెలుపు కోసం పని చేసిన రెండు వేల మందిని షిర్డి ట్రిప్‌కు ప్రత్యేక రైల్లో తీసుకెళ్లారు. దానికి కోటిపైగానే ఖర్చు చేశారు.
అప్పట్నుంచి ఆ దాతృత్వం అలా సాగుతూనే ఉంది. లాక్ డౌన్ టైమ్‌లో మరింతగా ఆయన ప్రజలకు సాయం చేశారు. లాక్ డౌన్ టైంలో పళ్లు, కాయలు, కూరగాయలు పండించే వారందరి దగ్గర కొనేసి.. నియోజకవర్గ ప్రజలకు.. పంచేశారు. దీని వల్ల రైతులకు డబ్బులొచ్చాయి.. ప్రజలకు ఉచితంగా సరుకులు అందాయి. మధ్యలో చెవిరెడ్డి మాత్రమే ఖర్చయిపోయారు. అయనా ఆయన లెక్క చేయలేదు. అది ఒక్కటే కాదు.. దాదాపు ఇరవై వేల మందికి… నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నాలుగు కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఏ పండుగ వచ్చినా.. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులందరికీ.., కానుకలు పంపడం ఆయన శైలి.
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఖర్చు పెట్టేది చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఖర్చు పెట్టరు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల నేతలు చేసిన ఖర్చును .. పంచిన డబ్బులను చూసిన అక్కడి జనం..గెలిచిన ఎవరైనా సరే.. ఐదేళ్ల పాటు.. సంపాదించుకునే పనిలో ఉంటారనే అనుకున్నారు. . కానీ.. రెండో సారి గెలిచిన చెవిరెడ్డి మాత్రం… ఎలక్షన్ల స్థాయి ఖర్చును… ఆ తర్వాత ఎక్కడా తగ్గించలేదు. అలా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అంత పెద్ద మొత్తంలో కోట్లకు కోట్లు.. ఎక్కడి నుంచి తెచ్చిపెడుతున్నారనేది సస్పెన్స్ గానే మారింది. అదే అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు.