వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి చాప్టర్ దాదాపుగా క్లోజింగ్‌కు దగ్గరగా వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తం తానై పనులు చక్కబెడుతున్న ఆయనను జగన్ క్రమంగా దూరం పెడుతున్నారు. ఆయన వల్లే జరగాల్సిన నష్టం జరిగిందన్న అభిప్రాయం కల్పించేలా ఇటీవల కాలంలో బ్లూ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్లేస్‌లోకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చుకునేందుకు సన్నాహాలు పూర్తి చేశారంటున్నారు. కొంత కాలంగా సీఎం జగన్‌కు చెవిరెడ్డి అత్యంత సన్నిహితమయ్యారు. ఏం కావాలన్నా ఆయన చేసి పెడుతున్నారు. చాలా వరకు అంతర్గత వ్యవహారాలు చక్క బెడుతున్నారు.
ఇప్పుడు నెంబర్ టు పొజిషన్ ను మార్చాలని నిర్ణయించుకోవడంతోనే చెవిరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయవద్దని.. తన వద్దకు రావాలని జగన్ పిలుపునిచ్చినట్లుగా చెబుతున్నారు. వారసులెవరికీ టిక్కెట్లు లేవని జగన్ ఖరాఖండిగా చెబుతున్నారు. కానీ చెవిరెడ్డికి మాత్రం ఆయన కుమారుడికే చాన్స్ ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని చెవిరెడ్డి కార్యకర్తల మీటింగ్ పెట్టుకుని మరీ చెప్పారు. దీంతో వైసీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. భూమన , ధర్మాన లాంటి నాయకులు కూడా తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకోవడానికి తంటాలు పడుతున్నారని కానీ చెవిరెడ్డికి మాత్రమే ప్రత్యేక అనుమతిని జగన్ ఇచ్చారని అంటున్నారు.
సీఎం జగన్ ది మొదటి నుంచి ఓ భిన్నమైన శైలి. మొత్తం నిర్ణయాలు తానే తీసుకున్నా… ఆది సలహాదారుల ప్రభావం అన్నట్లుగా కవరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏ చిన్న మంచి జరిగినా దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. తప్పు జరిగితే మాత్రం సలహాదారులపై తోసేస్తారు. ఇప్పుడు పార్టీకే గడ్డు పరిస్థితి వచ్చినందున సజ్జలను సైతం పక్కన పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చెవిరెడ్డి ఆ బాధ్యతలను నిర్వహించడం అప్పుడే ప్రారంభించారని అంటున్నారు. మెల్లగా ఇక సజ్జలకు సీఎం క్యాంప్ ఆఫీసులోకి కూడా ఎంట్రీ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వచ్చే మూడు నెలల్లో సజ్జలకు దారుణమైన పరాభవాలు ఎదురవుతాయని వైసీపీ వ్యవహారాలు.. జగన్ తీరు గురించి అవగాహన ఉన్న నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.