తెలంగాణ ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ కోసం వైసీపీ తరపున పని చేస్తున్నారన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. చెవిరెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా ఇందు కోసమే మూడు నెలల కిందటే నియమించారని అంటున్నారు. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి ఇద్దరూ తెలంగాణ ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టులు పొందిన కంపెనీల్లో పెద్దిరెడ్డి కంపెనీ ప్రముఖమైనది.
చెవిరెడ్డి, పెద్దిరెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ కు సహకరించే విషయంలో ప్రధానంగా ఫండింగ్ అంశాలను చూస్తున్నారని అంటున్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఈ ఇద్దరు నేతల ప్రత్యేక బృందాలు బీఆర్ఎస్ నేతల అర్థిక అవసరాలను ప్రత్యేక బృందాలను పెట్టి మరీ తీరుస్తున్నారని చెబుతున్నారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున నిధులు తెలంగాణకు వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొంత మంది వైసీపీ నేతలు నేరుగా బీఆర్ఎస్ విజయం కోసం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ .. ఏపీ సర్కార్ పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నా… అవి అక్కడి ప్రజల్లో జగన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మల్చుకోవడానికేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతే కానీ వైసీపీపై … కేసీఆర్ కు అభిమానం ఉందని.. ఆయన తెలంగాణలో గెలిస్తే.. ఏపీలో తమకు మరింత ప్రయోజనం కలుగుతుందని వారు నమ్ముతున్నారు.