వైసీపీలో రాజకీయాలు క్రమంగా మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మాస్టర్ స్ట్రాటజిస్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేవారు. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. కానీ ఆయన పలుకుబడి క్రమంగా తగ్గిపోతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం పెరుగుతూ వస్తోంది. ఇటీవల జరుగుతున్న నియామకాలు అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి చాయిస్ కాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆలోచనలేనని ప్రచారం తాడేపల్లి ప్యాలెస్ లో జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతర్గత నియామకాల బాధ్యత… పార్టీ నిర్మాణం పనులను చెవిరెడ్డికి అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన తాను సజ్జల కన్నా భిన్నంగా ఆలోచిస్తానని చెప్పేందుకు విచిత్రమైన నియామకాలకు సిఫారసులు చేస్తున్నారని అంటున్నారు. అలాగే పలు నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు విషయంలోనూ ఆయన చెప్పిందే జరుగుతోందని అంటున్నారు. జగన్ రెడ్డి బెంగళూరులో ఎక్కువరోజులు ఉంటున్నారు. వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు. అయితే చెవిరెడ్డి మాత్రం అత్యధిక సమయం పార్టీ ఆఫీసులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు పార్టీలో ఎక్కువ మంది సజ్జలను కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు. చెవిరెడ్డిని కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనను కలిస్తే పనులు అయిపోతాయన్న నమ్మకం ఉండటమే కారణం . పార్టీలో పదవులు చెవిరెడ్డి చేతుల మీదుగా భర్తీ అవుతున్నాయని తెలిసిన తర్వాత సజ్జల ఆఫీసు బోసిపోతోంది.ఈ పరిణామాన్ని సజ్జల వర్గీయులు కూడా ఊహించలేకపోతున్నారు.