మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఛావా’. గత నెల హిందీలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ అయ్యింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని డబ్బింగ్ చేసి, దాదాపు 500పైగా స్క్రీన్స్ లో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది. మరి ఇంతలా బాలీవుడ్ ని అలరించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఎలా వుంది? శంభాజీ కథలోని భావోద్వేగాలు, ఆయన చరిత్ర ప్రేక్షకుల్ని ఏ మేరకు కదిలించింది?
మొఘల్స్ ని ఎదురించి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి ధీరుడు ఛత్రపతి శివాజీ. ఆయన మరణం తర్వాత తన అపార సైన్యంతో మరాఠా సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చెయ్యడానికి సంసిద్ధమౌతాడు మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా). అయితే, శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యానికి, ధర్మానికి రక్షకుడిగా ఎదుగుతాడు శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). శంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు ఔరంగజేబు. ఈ పోరాటంలో అపారమైన మొగల్ సైన్యాన్ని శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? అంతర్గత రాజకీయాలు కారణంగా ఎలాంటి పరిస్థితి వచ్చింది? శత్రుసైన్యంతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచింది ఎవరు ? మరాఠా సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయాలనే ఔరంగజేబు కల తీరిందా? అనేది మిగతా కథ.
శంభాజీని చరిత్రకారులు పట్టించుకోలేదు. స్వయంగా మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ చెప్పిన మాటిది. ఆయన చరిత్ర కాస్తో కూస్తో వికీపీడియాలో దొరుకుతుంది కానీ పాఠ్యపుస్తకం రూపంలో పెద్దగా నిక్షిప్తం కాలేదు. అయితే మరాఠాలో ఆయన గురించి కొన్ని వీరగాధలు వున్నాయి. ఆయన చేసిన పోరాటం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ప్రచారంలో వున్నాయి. చరిత్రతో పాటు ప్రచారంలో వున్న అంశాలని గుదిగుచ్చి ‘ఛావా’ చిత్రంగా మలిచాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్.
సింహంతో పోరాటం చేయగలడు, వేలాది మంది సైనికులని ఒంటి చేత్తో మట్టికరిపించగలడు.. శంభాజీ వీరత్వం గురించి తరుచూ వినిపించే మాటలివి. ఈ రెండు ఎలిమెంట్స్ ఎస్టాబ్లెస్ చేస్తూ కథలో తొలి సన్నివేశాన్ని మలిచాడు దర్శకుడు. ఖాన్ జాన్ అడ్డాలోకి వెళ్లి అక్కడ శత్రువులు తరిమికొట్టడం, సింహం దవడలు చీల్చే సన్నివేశాలు ఆసక్తికరంగా వచ్చాయి. శంభాజీ గురించి అందుబాటులో వుండే కథ చాలా తక్కువ. రెండో సన్నివేశంతో ఆ సంగతి అర్ధమౌతుంది. దీంతో తెలివిగా స్క్రీన్ ప్లేని నాన్ లీనియర్ గా తీసుకెళ్ళాడు. కథనం ను ముందు వెనెక్కి జరుపుతూ ఆసక్తిని పెంచే ప్రయత్నం జరిగింది. అయితే తొలి సగంలో ఉత్కంఠని తెచ్చే సీన్స్ కరువయయ్యాయి. తొలి సగం దాదాపు మరాఠా అంతర్గత రాజకీయాలతోనే సరిపోయింది. ఆ రాజకీయం గురించి ముందుగా చరిత్ర తెలిసిన ప్రేక్షకులకు తప్పితే మిగతా ఆడియన్స్ కి శంభాజీ తప్పితే మరో పాత్ర రిజిస్టర్ అవ్వదు.
శంభాజీ అసలు పోరాటం సెకండ్ హాఫ్ లోనే వస్తుంది. అతడు చేసిన గెరిల్లా పోరాటాలని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. క్లైమాక్స్ కి ముందు వచ్చే వార్ సీక్వెన్స్ భారీగా తీర్చిదిద్దారు. సుదీర్గంగా సాగే పోరాటం అది. ఇక చివరి ముఫ్ఫై నిముషాలు నిజంగా కట్టిపడేస్తుంది. నిజానికి వీరుడు బంధీ అయిన తర్వాత ఇంక ఏముంటుదనే ఫీలింగ్ రావడం సహజం. కానీ ఇక్కడే కథలో ఒక ఎమోషన్ యాడ్ అవుతుంది. శంభాజీ, ఔరంగజేబ్ మధ్య నడిచే సంభాషణలు ఒక ఫైట్ చేస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. శంభాజీ, మంత్రి కవికలశ్ మధ్య వచ్చే కవితాత్మక సంభాషణ హార్ట్ టచ్చింగ్ గా వుంటుంది. ఎన్ని చిత్రహింసలు పెట్టినా వెన్నువిరుచుకు నిలబడిన శంభాజీ వీరత్వం సెల్యూట్ చేసేలా వుంటుంది. అయితే శంభాజీ గురించి ఇంకాస్త లోతుగా తెలిసిన వారికి ఛావా అసంపూర్ణంగా అనిపించవచ్చు. ప్రతి మనిషిలో మంచి చెడులు వుంటాయి. శంభాజీ గురించి కొన్ని వింతైన విశేషాలు ప్రచారం వున్నాయి. అవేవీ కూడా టచ్ చేయకుండా కేవలం పాజిటివ్ సైడ్ మాత్రమే దృష్టి పెట్టిందీ సినిమా.
పెద్ద కథ లేకపోయినా సినిమా ఇంత ఎఫెక్టివ్ గా రావడానికి కారణం విక్కీ కౌశల్ నటన. ఈ సినిమాతో తనకి చాలా అవార్డులు వస్తాయి. శంభాజీ పాత్రలో జీవించేశాడు విక్కీ. చివరి ముఫ్ఫై నిముషాలైతే నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా సహజమైన నటన కనబరిచాడు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక పాత్రకు న్యాయం చేసింది. మిగతా పాత్రలన్నీ డీసెంట్ గా వున్నాయి.
టెక్నికల్ గా సినిమా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ కి మంచి మార్కులు పడతాయి. ఏఆర్ రెహమాన్ పాటలు అంతగా ఆకట్టుకోవు కానీ నేపథ్య సంగీతం మాత్రం కాస్త వెరైటీగా చేశాడు. ఇంతముందు ఆయనకి మొఘల్ టచ్ తో వుండే సినిమాలు చేసిన అనుభవం వుంది. అయితే ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న థీమ్స్ అరబిక్, సూఫీ స్టయిల్ లో వినిపిస్తాయి. మాంచి వార్ సీక్వెన్స్ లో ”జై భవానీ.. జై భవానీ’అని సౌండ్ ఇస్తే క్యాచిగా అనిపిస్తుంది. కానీ రెహ్మాన్ అక్కడ కూడా ఏదో ఎమోషన్ ని చెప్పడానికి అన్నట్టు అరబిక్ టచ్ తో ఓ పెక్యులర్ సౌండ్ వేస్తాడు. అది కొంతమందికి నాన్ సింక్ కొట్టే ఛాన్స్ వుంది. శివాజీ కిరీటాన్ని శంభాజీ చూసినప్పుడు ఓ బీజీఎం వస్తుంది. అలాంటి ఎమోషనల్ డెప్త్ తో కూడుకున్న మ్యూజిక్ రెహ్మాన్ కే సాధ్యపడుతుంది.
తెలుగు డబ్బింగ్ ఓకే గానీ ట్రూ ట్రాన్స్ లేట్ చేసే క్రమంలో కొన్ని మాటలు పంటికింద రాయిలా తగిలిన ఫీలింగ్ కలుగుతుంది. విక్కీ పాత్రకుడబ్బింగ్బాగానేకుదిరింది. మరాఠా సామ్రాజ్యం, స్వరాజ్య కాంక్ష, స్వధర్మ స్వేఛ్చ, శంభాజీ వీరోచిత పోరాటం ప్రధానాంశాలు తెరకెక్కించిన ‘ఛావా’ ఓ హిస్టారికల్ మూవీ చూసిన అనుభూతినైతే పంచుతుంది.