అదానీ గ్రూప్ అంతర్జాతీయ పోర్టులు.. ఎయిర్ పోర్టులన్నింటినీ కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. నిర్మించి.. నిర్వహిస్తున్న జీవీకే నుంచి కైవసం చేసుకుంది. ఇటీవలే అధికారిక ప్రకటన చేసిన అదానీ గ్రూప్ ఇప్పుడు పేర్లు మార్చే పనిలో పడింది. ప్రస్తుతం శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్న ముంబై ఎయిర్ పోర్టు పేరును.. అదానీ ఎయిర్ పోర్టుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ముంబై లో ఏర్పాటు చేశారు. ఒక్క సారిగాఈ హోర్డింగ్‌లు చూసిన… శివాజీ భక్తులైన శివసైనికులకు ఒక్కసారిగా ఆగ్రహం ముంచుకొచ్చింది.
అంతే.. దొరికిన హోర్డింగులన్నింటినీ ఎక్కడికక్కడ చించేశారు. చేయాల్సినంత రచ్చ చేశారు. దీంతో ముంబైలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి అదానీ గ్రూప్ స్పందించాల్సి వచ్చింది. తాము ముంబై ఎయిర్ పోర్టు పేరు మార్చలేదని వివరణ ఇచ్చింది. శివాజీ పేరునే కొనసాగిస్తున్నామని… కానీ ఆ ఎయిర్ పోర్టు అదానీ గ్రూప్ పరం అయినందున.. ఆ విషయాన్ని తెలియచేసేందుకే పెద్ద పెద్ద బోర్డులు పెట్టామని అంటోంది. అయితే.. అధికారికంగా పేరు మార్చకపోయినా.. వ్యవహారికంలో అయినా అదాని ఎయిర్‌పోర్టు అన్న ప్రచారం రావాలన్న ఉద్దేశంతోనే … అదానీ గ్రూప్ ప్రచార వ్యూహం ఖరారు చేసుకుంది. దాని ప్రకారం.. హోర్డింగులు.. ఇతర చోట్ల అదానీ ఎయిర్ పోర్టుగా వ్యవహరిస్తోంది.
ఇది శివసేనకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే.. అధికారంలో ఉన్నప్పటికీ.. పెద్ద ఎత్తున నిరసనచేపట్టారు. హోర్డింగులు కూల్చివేశారు. ఈ అంశంపై బీజేపీ, శివసేన మధ్య మళ్లీ మాటలు మంటలు చెలరేగుతున్నాయి. టేకోవర్లలో రాటుదేలిపోయిన అదానీ… తన పేరును ఓ బ్రాండ్‌గా మార్చుకునేందుకు టేకేవర్ చేసిన సంస్థల ద్వారానే ప్రయత్నిస్తూండటం ఆసక్తికరంగా మారింది.