పెద్ద నోట్ల రద్దు బీజేపీని రాజకీయంగా దెబ్బతీస్తుందని ప్రతిపక్షాలు భావించాయి. వాటి అంచనా తప్పనే విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించింది. మొత్తం 26 వార్డుల్లో బీజేపీ 20 చోట్ల నెగ్గింది. దాని మిత్రపక్షం అకాలీదళ్ ఒక సీటు నెగ్గింది. కాంగ్రెస్ 4 సీట్లకే పరిమితమైంది.
క్రితం సారి కాంగ్రెస్ 11 సీట్లు, బీజేపీ 10 సీట్లు సాధించాయి. ఈ సారి బీజేపీ స్కోర్ 10 నుంచి 20కి పెరిగింది. కాంగ్రెస్ సీట్ల సంఖ్య 11 నుంచి 4కు పడిపోయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ ఫలితాలు కమలనాథులక కొత్త జోష్ తెచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ నేతలు ఖుషీగా ఉన్నారు.
ఇటీవల మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ విజయ దుందుభి మోగించింది. మొదటి విడతల్లో ఘన విజయాలను సాధించింది. మూడో విడతలో కాంగ్రెస్ కాస్త చెప్పుకోదగ్గ విజయాలను పొందింది. మొత్తం మీద కమలానికే ఎక్కువ సీట్లు దక్కాయి. ఆ తర్వాత గుజరాత్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 134 తాలూకా పంచాయతీలకు గాను 109 చోట్ల కమలం వికసించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తమకు భారీగా సీట్లు వస్తాయని అంచనా వేసిన కాంగ్రెస్ డీలా పడింది.
పరిస్థితిని చూస్తుంటే ఉత్తర్ ప్రదేశ్ సహా మొత్తం ఐదు రాష్ట్రాలకు మరో రెండు మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లోనూ తమదే విజయమని బీజేపీ ధీమాతో ఉంది. తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా దీర్ఘకాలికంగా దేశానికి మంచి జరుగుతుందనే ప్రధాని మోడీ మాటను ప్రజలు నమ్ముతున్నారనేది కమలనాథుల విశ్వాసం. అందుకే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలు మద్దతిస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రజలకు ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు. అలాగే యూపీ ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం బీజేపీకి వస్తుందా? వేచి చూద్దాం.