అనేక తీవ్ర నేరాలకు పాల్పడి గత రెండు దశాబ్దాలుగా పోలీసులకి చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న మాఫియా గ్యాంగ్ లీడర్ ఛోటా రాజన్ గత నెల 26వ తేదీన ఇండోనేషియాలోని బాలి విమానాశ్రయంలో పోలీసులకు పట్టు బడ్డాడు. అప్పటి నుంచి అతనిని భారత్ కి తిరిగి తీసుకువచ్చేందుకు సిబీఐ, ముంబై క్రైం బ్రాంచ్, డిల్లీ స్పెషల్ పోలీస్ మరియు విదేశాంగ శాఖ అధికారులు కలిసి చేసిన కృషి ఫలించింది. అతనిని ప్రత్యేక విమానంలో ఈరోజు డిల్లీకి తీసుకువచ్చేరు. ఇవ్వాళ్ళ తెల్లవారుజామున ఐదు గంటలకు డిల్లీ విమానాశ్రయం చేరుకొన్నాడు.
అతనిని సిబిఐ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నకిలీ పాస్ పోర్ట్ కేసులో ప్రశ్నిస్తారు. వారి విచారణ ముగుసిన తరువాత అతనిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకి అప్పగిస్తారు. అతనిపై సుమారు 70కి పైగా కేసులున్నాయి. 55ఏళ్ళు వయసు గల ఛోటా రాజన్ అసలుపేరు రాజేంద్ర సదాశివ్ నిఖల్జి. తనను ముంబైకి తరలిస్తే ముంబై పోలీసులు తనను తప్పకుండా హత్యచేస్తారని రాజన్ ఆరోపించాడు. ముంబై పోలీసులలో తన బద్ధ శత్రువయిన దావూద్ ఇబ్రహీం మనుషులు కూడా ఉన్నారని రాజన్ చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. 1993 ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళలో అనేక మంది మరణానికి కారకుడయిన ఛోటా రాజన్ పోలీసులకు పట్టుబడగానే ఇప్పుడు ప్రాణభయం పట్టుకొన్నట్లుంది. భారత్ లో పోలీసుల విచారణ పూర్తి కావడానికి, న్యాయస్థానాలు తీర్పు చెప్పడానికి చాల సమయం పట్టవచ్చును. కానీ ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి చివరికి ఏ గతి పడుతుందో అందరూ చూసారు. బహుశః ఛోటా రాజన్ కి కూడా అదే గతి పట్టవచ్చును.