అందరి దృష్టీ కెప్టెన్ కుర్చీపై ఉండడం మామూలే. అయితే… కథానాయకుడిగా సినిమా చేస్తున్నప్పుడే… దర్శకుడిగా అవతారం ఎత్తాల్సిరావడం, తన కథ కోసం మరో హీరోని ఎంచుకోవడమే కాస్త కొత్త. రాహుల్ రవీంద్రన్ ఈ ఫీట్ చేసేశాడు. అందాల రాక్షసితో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రాహుల్. ఆ సినిమాతో లవర్ బోయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతలోనే.. ‘చిలసౌ’తో దర్శకుడిగా అవతారం ఎత్తాడు. వచ్చే వారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా కొత్త దర్శకుడు రాహుల్‌తో చిట్ చాట్..
సడన్‌గా ఈ దర్శకత్వ అవతారం ఏమిటి?
నిజం చెప్పాలంటే నేను దర్శకుడ్ని కావాలనే ఈ రంగంలోకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేద్దామని ఆఫీసుల చుట్టూ తిరిగాను.కానీ వర్కవుట్ అవ్వలేదు. అనుకోకుండా మోడల్ గా అవతారం ఎత్తాల్సివచ్చింది. ఓ యాడ్‌లో నన్ను చూసి.. సినిమాలో హీరోని చేసేశారు. `ఏదో ఒకటిలే.. సినిమాల్లో ఉంటే కనీసం ఈ వాతావరణమైనా అలవాటు అవుతుంది` అనుకుని… ఒప్పేసుకున్నా. ఇన్నాళ్లకు దర్శకుడిగా అవకాశం వచ్చింది.
మీ తొలి సినిమాకి సుశాంత్‌నే కథానాయకుడిగా ఎందుకు ఎంచుకున్నారు?? నిర్మాతని వెదుక్కోవాల్సిన పని లేదనా?
నిజానికి సుశాంత్ సినిమాలకు సుశాంతే ప్రొడ్యూసర్ అనే సంగతి నాకు ఇది వరకు తెలీదు. సుశాంత్‌కి ఈ కథ చెప్పినప్పుడు కూడా `నేనిప్పుడు బయటి నిర్మాతలతో సినిమాలు చేద్దామనుకుంటున్నా` అన్నాడు. అయితే అప్పటికే నా చేతిలో నిర్మాతలున్నారు. నిర్మాత దొరుకుతాడని కాదు… ఈ కథకు తనే బాగా నప్పుతాడనిపించింది.
ఈ కథ మరో హీరోకెవరికైనా చెప్పారా?
నాలుగేళ్ల క్రితం ఓ హీరోకి చెప్పా. `చాలా బాగుంది. కానీ… నేనున్న పొజీషన్లో ఇలాంటి క్లాస్ సినిమాలు చేయలేను` అన్నాడు. నిజానికి అప్పటికి న్యూ ఏజ్ సినిమాలు ఇంకా అలవాటు పడలేదు. ఆ తరవాతే… పెళ్లి చూపులు, ఘాజీ, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలొచ్చాయి. సో… నా దగ్గరున్న కథలకు ఇదే సరైన అవకాశం అనిపించింది.
ఇది మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసం తీసిన సినిమానా?
ఇది వరకు రెండు మూడు కోట్లలో సినిమా తీసేసి, ఇది మల్టీప్లెక్స్ వరకూ చూస్తే సరిపోతుందిలే అనుకునేవారు. ఇప్పుడు క్లాస్ సినిమాని అన్ని వర్గాల వాళ్లూ చూస్తున్నారు. అందుకే ఘాజీ, పెళ్లి చూపులు సినిమాలకు ఆ రేంజులో వసూళ్లు వచ్చాయి. నా సినిమా కూడా అందరి కోసమే.
సమంత రికమెండేషన్ వల్లే ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ చేతికి వెళ్లిందంటున్నారు.. నిజమేనా?
సమంత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. దాదాపు ఏడెనిమిదేళ్ల స్నేహం మాది. నేను సినిమా తీస్తున్నాను అనగానే సంతోషపడిపోయింది. `వీడు సినిమా ఎలా తీస్తాడో ` అని నాకంటే ఎక్కువ కంగారు పడింది. సినిమా పూర్తవగానే `ఎలా తీశావో చూస్తా` అని చెప్పి ఓ షో వేయించుకుంది. చైతూ, సమంత కలిసి ఈ సినిమా చూశారు. అయితే గమ్మత్తైన విషయం ఏమిటంటే.. సమంత సగం సినిమా మాత్రమే చూసింది. తనకు వేరే పని ఉందని వెళ్లిపోయింది. సినిమా మొత్తం చూసింది చైతూనే. తనకి బాగా నచ్చింది. ఆ తరవాత నాగ్ సార్‌కి చూపించారు. ఆయనకూ బాగా నచ్చింది. అలా.. అన్నపూర్ణ సంస్థ చేతిలోకి ఈ సినిమా వెళ్లింది.
అన్నపూర్ణ సంస్థలో మూడు సినిమాలకు ఎగ్రిమెంట్ కుదిరిందట కదా.. నిజమేనా?
మూడు కాదు.. ఓ సినిమా చేయమన్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. రెండు లైన్లు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఆ కథని బట్టే హీరో ఎవరన్నది డిసైడ్ అవుతుంది.
హీరోగా చేస్తూ.. దర్శకత్వం అంటే రిస్క్ అనిపించలేదా?
ముందే చెప్పాను కదా, నేను హీరో అవ్వాలని ఈ పరిశ్రమకు రాలేదని. డైరెక్షన్ అనేది నా మైండ్‌లో ఉంది. ఈ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఎప్పటికీ దర్శకుడ్ని అవ్వలేను.
ఈ టైమ్‌లో నీకు డైరక్షన్ అవసరమా? అని ఫ్రెండ్సెవరూ ఆపలేదా?
వెన్నెల కిషోర్, ఆడవిశేష్ నాకు మంచి మిత్రులు. వాళ్లకు తప్ప.. నేను డైరక్షన్ చేస్తున్నానన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. కథ ఓకే అయిపోయి సెట్స్‌కి వెళ్లేంత వరకూ ఎవరికీ చెప్పలేదు. నా తపన వాళ్లకు తెలుసు కాబట్టి ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు.
హీరోగా కెరీర్ కొనసాగిస్తారా?
తప్పకుండా. అయితే… ఇది వరకు మొహమాటం కొద్దీ కథ అంతగా నచ్చకపోయినా ఒప్పుకునేవాడ్ని. ఇప్పుడు అలా కాదు. మనసుకు నచ్చిన సినిమాలే చేస్తా. దృష్టి అనే ఓ సినిమా పూర్తయింది. త్వరలో విడుదల కానుంది. యూటర్న్లోనూ ఓ కీలక పాత్ర చేస్తున్నా.
ఇంతకీ ‘చి.ల.సౌ’ కథేంటి?
ఈతరం అమ్మాయి, అబ్బాయిల ఆలోచనల్ని తెరపైకి తీసుకొస్తున్నా. ఓ రోజు కథ ఇది. ఓ రోజులో ఓ అబ్బాయి, అమ్మాయి ప్రయాణం ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? అనేది చూపిస్తున్నా.