హైదరాబాద్: కందిపప్పు ధర చికెన్‌ను దాటిపోయింది. కేజీ కందిపప్పు ధర ఇప్పుడు రు.200 పలుకుతోంది. ఆన్లైన్ రీటైల్ స్టోర్స్‌లో రు.210 చొప్పున అమ్ముతున్నారు. గత ఏడాది రేటుతో పోల్చితే ఇది దాదపు రెట్టింపు. ఇక పెసరపప్పు ధర కిలో రు.113, మినప్పప్పు ధర రు.150 తాకాయి. మరోవైపు చికెన్ ధర ప్రస్తుతం కేజి రు. 130గా ఉంది.
కందిపప్పు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వాడే ఆహారపదార్థం కావటంతో దాని ధర విపరీతంగా పెరిగిపోవటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వర్తకులు సరుకును బ్లాక్ చేయటంవల్లే ఇలా ధర అకస్మాత్తుగా పెరిగిపోయిందనే వాదన వినబడుతోంది. బాగా డిమాండ్ పెరిగేదాకా సరుకును బ్లాక్ చేసి అప్పుడు అధిక ధరతో మార్కెట్లోకి వదులుతారని అంటున్నారు. వర్తకులు ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి తగ్గిపోయిందని, సప్లయ్ తగ్గిపోవటమే ధర పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. గతనెల వరకు తాము 30,000 కిలోల కందిపప్పును స్టాక్ పెట్టుకునేవాళ్ళమని, ఇప్పుడ తమవద్ద 300 కిలోల స్టాక్ మాత్రమే ఉందని ఒక స్టాకిస్ట్ చెప్పారు. ఇదిలా ఉంటే ధర పెరిగిపోయిన కారణంగా కందిపప్పు కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గిపోయిందని రీటైల్ వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు ఈ ధర ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతుండటంతో సామాన్య మానవులు పప్పును కొంతకాలం మర్చిపోవాలేమో!