కొంతవరకు మనకు అనుకూలతలుగా కనిపించే కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో భయంకరమైన ప్రతికూలతలుగా మారిపోతాయి. సెలబ్రిటీ హోదా కూడా అలాంటిదే.. సెలబ్రిటీకావడం బాగానే ఉంటుది. కానీ కనీసం బజార్లో నిల్చుని ఐస్‌క్రీం తినాలన్నా కూడా వీలుకాని పరిస్థితి వచ్చిన తర్వాతే చిక్కులు తెలుస్తాయి. ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో హీరోయిన్ ఖుష్బూ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమె క్రౌడ్‌పుల్లర్, జనాల్లో ఆకర్షణ ఉన్న నాయకురాలు వంటి హోదాలు ఆమెకు ఇప్పుడు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఆమె రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ఉపయోగపడుతుంది గనుక.. ఆమెకు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా ప్రచారానికి వాడుకుందాం అని ఆమె వ్యతిరేక వర్గం వ్యూహాత్మకంగా కుట్రలు చేస్తున్నది.
ఖుష్బూ రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేయడానికి వెనుకున్న మాస్టర్‌మైండ్ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఖుష్బూ అంటే కిట్టని చిదంబరం, ఆమెకు పార్టీ టిక్కెట్ ఇవ్వదలచుకుంటున్న చోట.. తన వర్గం మనుషులకే టిక్కెట్ కావాలని పట్టుపడుతూ… ఆమెకు ఇస్తే రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతాం అని బెదిరిస్తూ ఉన్నారుట. అదే సమయంలో ఆమెకు మరో చోట టిక్కెట్ ఇవ్వబోతే.. అసలెందుకు ఆమెను ప్రచారానికి వాడుకుంటే పార్టీకి ఎక్కువ లాభం కదా అంటున్నారట. మొత్తానికి ఖుష్బూ రాజకీయంగా ఎలాంటి హోదాలోకి రాకుండా ఆయన దార్లు మూయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
తొలుత ఆర్కే నగర్లో జయలలిత మీద ఖుష్బూ పోటీచేస్తుందని అన్నారు. కానీ చివరికి ఇక్కడ డీఎంకే అభ్యర్థిని ప్రకటించేసింది. మైలాపూర్ స్థానం మీద ఖుష్బూ మనసుపడుతోంటే, చిదంబరం బ్యాచ్ అడ్డుపడుతోంది. కాంగ్రెస్‌కు డీఎంకే మధ్య పొత్తులున్నాయి. అయితే ఖుష్బూ గతంలో డీఎంకేలో ఉంటూ స్టాలిన్‌తో విభేదించి బయటకు వచ్చారు. ఇప్పుడు ఖుష్బూ ఎక్కడ పోటీచేసినా డీఎంకే పార్టీ మరియు స్టాలిన్ వర్గం ఆమెకు ప్రతికూలంగా పనిచేస్తుందని.. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం అని చిద్దూ వర్గం వాదన. ఆరకంగా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తన సొంతరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంకా కుట్ర రాజకీయాలు పుష్కలంగా చేస్తున్నారన్నమాట.