హర్యానా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ బీజేపీ గెలిచింది. ఫలితాల కౌంటింగ్ రోజు ఎనిమిదిన్నరకే కాంగ్రెస్ 70 సీట్లలో ఆధిక్యంలో ఉందని మీడియా ప్రకటించింది. కానీ తర్వాత ఫలితలు మారిపోయాయి. ఇవన్నీ చూపించి ఈవీఎంలను తప్పు పడుతున్నారు కొందరు. దీనిపై ఎన్నికల సంఘం చీఫ్ కమిషర్ రాజీవ్ కుమార్ సూటిగా సుత్తి లేకుండా తేల్చిచెప్పారు.
ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత ఏముందని.. అవి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యేదే ఎనిమిదిన్నర గంటలకు అని రాజీవ్ కుమార్ గుర్తు చేశారు. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. కానీ ఎనిమిదిన్నర కాక ముందే ఫలితాల ట్రెండ్స్ ను న్యూస్ చానల్స్ ప్రకటించేశాయి. తర్వాత అసలు ఫలితాలు వేరుగా వస్తే దానికి ఈవీఎంలను ఎలా నిందిస్తారన్న ప్రశ్నలు కూడా ఆయన వేశారు.
ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అనేది అసాధ్యమని రాజీవ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. తాము అనుకున్నట్లగా ఫలితాలు రాకపోతే ఈవీఎంలపై నిందలు వేసి.. ఈసీ విశ్వసనీయతను ప్రశ్నిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. గెలిచిన రాష్ట్రాల్లోని ఫలితాలను పెద్దగా పట్టించుకోకుండా ఓడిపోయిన రాష్ట్రాల్లోని ఫలితాలపై కొన్ని పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తాము గెలిచినప్పుడు ఈవీఎంలు మంచివని.. ఓడిపోతే ట్యాంపరింగ్ అని ఆరోపణలు చేస్తున్నాయి. వారందరికీ సీఈసీ క్లారిటీ ఇచ్చేశారు.