తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వైదొలిగారు. వేరే బెంచ్‌కు కేటాయించారు. రెండు రోజులక్రితం ఆయన రెండు రాష్ట్రాలకు మధ్యవర్తిత్వం చేసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా న్యాయపరమైన పరిష్కారమే కావాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. దీంతో జస్టిస్ ఎన్వీ రమణ మరో బెంచ్‌కు పిటిషన్ బదలాయించాలని నిర్ణయించారు . అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనమే విచారించాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. అయితే చీఫ్ జస్టిస్ మాత్రం అంగీకరించలేదు. దీంతో మరో బెంచ్‌లో విచారణ జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం.. రాజకీయ వ్యూహం అన్న అభిప్రాయం కూడా ఉన్న నేపధ్యంలో సుప్రీంకోర్టులో విచారణపై రాజకీయవర్గాల్లో ఆసక్తి ఏర్పిడింది.
మధ్యవర్తిత్వం చేసుకోవాలన్న సూచన మేరకు .. రెండు రాష్ట్రాలు ఏమైనా ప్రయత్నాలు చేస్తాయేమోనని అనుకున్నారు. కానీ అలాంటి ప్రయత్నమే చేయకపోగా… సుప్రీంకోర్టే పరిష్కరించాలని కోర్టులో వాదించారు. కేంద్రం కూడా అదే చెబుతోంది. నిజానికి ముందుగా విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్లో చర్చించుకుని జల వివాదాలను పరిష్కరించుకోవాలి. కానీ అపెక్స్ కౌన్సిల్లో ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభించడం లేదు సరి కదా.. మరితం పెరుగుతున్నాయి. కేఆర్ఎంబీ తో పాటు గోదావరి రివర్ బోర్డులను కేంద్రం ఏకపక్షంగా నోటిఫై చేసింది. గెజిట్ అమలుకు ఇప్పుడు రెండు రాష్ట్రాలూ అంగీకరించడంలేదు దీంతో సమస్య మరింత పీట ముడి పడినట్లయింది.
జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడంతో సహజంగానే ఆయన తెలుగు రాష్ట్రాల మధ్య జలాల వివాదంపై విచారణ చేయరని అనుకున్నారు. అయన ఉన్న ధర్మాసనంలో ఎలాంటి విచారణ జరిగినా ఉద్దేశాలు ఆపాదించడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిస్ ఎన్వీ రమణ.. విచారణ నుంచి వైదొలగడానికే కీలక నిర్ణయం తీసుకున్నారు.