మీడియాపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. ఇంత బాధ్యతా రాహిత్యంగా ఉంటుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు. మీడియా తీరు వల్ల కొంత మంది న్యాయమూర్తుల కెరీర్లు కూడా ప్రమాదంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా ఈ రోజు పదవి విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి బెంచ్ పంచుకున్న ఎన్వీ రమణ ఓకేసు విచారణ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్వీ రమణ అసంతృప్తికి కారణం … సుప్రీంకోర్టు కొలీజియం తొమ్మిది మంది న్యాయమూర్తుల్ని నియమించడానికి కేంద్రానికి సిఫార్సు చేసిందని కొన్ని మీడియాలు వెల్లడించాయి. పేర్లు పెట్టి మరీ ప్రకటనలు చేశాయి.
కొంత మంది మరికొంత మంది ముందుకు వెళ్లి ఆయా న్యాయమూర్తుల సీనియార్టీని కూడా లెక్కించి చీఫ్ జస్టిస్‌లు ఎవరెవరు ఎప్పుడెప్పుడు అవుతారో కూడా చెప్పేశారు. సుప్రీంకోర్టుకు మహిళా న్యాయమూర్తి రాబోతున్నారని ప్రచారం చేశారు. ఈ వార్తలపైనే సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. కొలీజియం సమావేశాలు ఇంకా జరుగుతున్నాయని.. ఇలాంటి సందర్భంలో ఇలా ప్రకటనలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. చాలా మంది సీనియర్ పాత్రికేయులు ఈ సమాచారాన్ని ప్రచురించకుండా ఉన్నారని వారందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు. కొలీజియం సిఫార్సులను కేంద్రానికి పంపుతుంది.
కేంద్రం ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపుతుంది. ఆ తర్వాత అధికారిక నోటిఫికేషన్ వస్తుంది. అయితే కొలిజీయం నుంచే ఇంకా కేంద్రానికి సిఫార్సులు వెళ్లలేదు. ఈ కారణంగానే జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది. చాలా మీడియా సంస్థలు.. ముందుగా వారి పేర్లను ప్రకటించాయి. తర్వతా సీజేఐ అసంతప్తి వ్యక్తం చేయడంతో తొలగించాయి.