‘సాధారణంగా మెట్రో రైల్ ప్రాజెక్టులు 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలోనే లాభసాటిగా నడుస్తాయి. అంతకంటే తక్కువ ఉన్న విజయవాడలో మెట్రో రైల్ నిర్మాణం చెప్పట్టడం వలన ప్రభుత్వానికి భారం అవుతుంది. కనుక, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేయలేము,’ అని తెలియజేస్తూ కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఒక లేఖ వ్రాసింది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి హామీలను నిలబెట్టుకొనందుకే కేంద్రప్రభుత్వంపై చాలా గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రజలు విజయవాడ మెట్రో ప్రాజెక్టుని కూడా పక్కన పెట్టేయడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ తో సమావేశమయినప్పుడు విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికే మొగ్గు చూపడం విశేషం.
జపాన్ దేశానికి చెందిన జైకా అనే సంస్థ దీనికి అవసరమయిన నిధులు సమకూర్చేందుకు సిద్దంగా ఉందని కనుక ఈ ప్రాజెక్టుని ముందు అనుకొన్నట్లుగానే 2018లోగా పూర్తి చేయమని ముఖ్యమంత్రి కోరారు. ఇక నుండి ఈ ప్రాజెక్టు పురోగతిపై నెలవారీ నివేదికలు ఇవ్వాలని కోరారు. కనుక ఇక కేంద్రప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేయకపోయినా త్వరలోనే నిర్మాణపనులు మొదలుపెట్టే అవకాశం ఉందని భావించవచ్చును. ప్రస్తుతం విజయవాడ జనాభా తక్కువ ఉన్నప్పటికీ రాజధాని నగరానికి రూపురేఖలు వచ్చే సమయానికే దేశ విదేశాల నుండి చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల నుండి వచ్చే వారితో జనాభా చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు కూడా సరిగ్గా అప్పుడే పూర్తవుతుంది. పైగా హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలు, ఉద్యోగులు అందరూ విజయవాడకి తరలివస్తారు. కనుక కేంద్రప్రభుత్వం చెపుతున్న అభ్యంతరాలు సహేతుకంగా లేవని చెప్పక తప్పదు. వైజాగ్, విజయవాడ రెండు చోట్ల ఒకేసారి నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెడతానని శ్రీధరన్ ముందే తెలిపారు. వైజాగ్ లో మూడు మెట్రో కారిడార్లు, విజయవాడలో ఒకటి నిర్మించబోతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనకి నిధుల కొరత ఉండబోదని హామీ ఇచ్చారు కనుక త్వరలోనే రెండు చోట్ల మెట్రో పనులు మొదలుపెట్టవచ్చును.