ఇంతవరకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధికార తెదేపా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చాలా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ తెదేపా మంత్రులు, నేతల ద్వారానే ఆయనకి జవాబిలిప్పిస్తున్నారు తప్ప ఏనాడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా స్పందించలేదు. “రాజకీయంగా సమ ఉజ్జీలతోనే మాట్లాడితేనే గౌరవం ఉంటుందని” చంద్రబాబు నాయుడు అన్నారు. అతను లేవనెత్తుతున్న ప్రశ్నలకు, చేస్తున్న విమర్శలకు జవాబులు చెపుతూ ప్రతివిమర్శలు చేస్తూ అతనితో వాదోపవాదాలకు దిగడంవలన తన స్థాయిని దిగజార్చుకోవడమే కాకుండా అతనికి అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన తన మంత్రులు, పార్టీ నేతల ద్వారా జగన్ చేస్తున్న విమర్శలకి జవాబిప్పిస్తున్నట్లు స్పష్టమయింది. కానీ భూసేకరణ, ప్రత్యేక హోదా అంశాలపై జగన్మోహన్ రెడ్డి ధర్నాలు, రాష్ట్ర బంద్ లు చేస్తూ తనని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటంతో ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. ఈ రెండు అంశాలు ప్రజలను అత్యంత ప్రభావితం చేస్తూ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఒక త్రాటిపైకి తీసుకురాగలిగాయి. ఇంకా ఉపేక్షిస్తే దీని వలన తన ప్రభుత్వానికి మున్ముందు చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన స్పందించి ఉండవచ్చును.
ఈ రెండు అంశాలపై తను చర్చకు సిద్దమని, కాంగ్రెస్, వైకాపాలకు ఆయన సవాలు విసిరారు. ఆ రెండు పార్టీలు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలలో ఎండగడతానని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆ రెండు పార్టీలు పెద్ద ఆటంకంగా మారాయని అన్నారు. తను త్వరలో అధికారంలోకి వస్తాను…ప్రభుత్వం తీసుకొన్న రైతుల భూములను తిరిగి ఇస్తానని జగన్ చెప్పుకోవడాన్ని చంద్రబాబు ఎద్దేవా చేసారు. పోలవరం క్రింద కూడా అనేక వేల ఎకరాల భూమి పోయిందని దానిని కూడా తిరిగి ఇచ్చేస్తారా? భూములు పోకూడదంటే రాజధాని, పోలవరం కట్టవద్దని చెప్పగలరా? మీరు అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తుంటే తను రాష్ట్రాభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.
వైకాపా త్రవ్విన అవినీతిలో గోతిలో చివరికి వాళ్ళే పడ్డారు. తాము గోతిలో పడటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసే దుస్థితి కల్పించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్బ్ కి వైయస్సార్ ప్రభుత్వం 8,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా ధారాదత్తం చేసింది. దానిని ఈడీ అటాచ్ చేసింది. దాని వలన ప్రభుత్వం నష్టపోవలసి వచ్చింది. అటువంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడుకొనేందుకు మేము చట్టం చేయవలసి వస్తోంది. ఇటువంటి పనులు చేసినవాళ్ళు కూడా మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారిప్పుడు.
రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనుకొంటే అడ్డుపడతారు. రాజధాని కడతామంటే అడ్డుపడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం డిల్లీలో ధర్నా చేసిన పెద్దమనిషి దాని గురించి ప్రధాని నరేంద్ర మోడీతో గట్టిగా మాట్లాడకుండానే తిరిగివచ్చి ఇప్పుడు రాష్ట్ర బంద్ కి పిలుపునివ్వడం విడ్డూరంగా ఉంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్, సెక్షన్: 8 అమలు, విభజన చట్టంలో ఇతర అంశాల గురించి అతను మాట్లాడాడని కానీ ప్రభుత్వం ఏ పని తలపెట్టినా దానిని విమర్శిస్తూ మాట్లాడుతాడని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
అభివృద్ధి నిరోధకులయియన్ అటువంటి వ్యక్తుల, పార్టీల మాటలు విని భావోద్వేగానికి లోనయి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన ప్రజలకు హితవు చెప్పారు. ఏవిధంగా ముందుకు వెళితే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో అలాగే ముందుకు వెళుతున్నామని, కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న చెడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇదరూ తమ వాదనలను చాలా సమర్ధంగానే వినిపిస్తున్నారు. రాష్ర్టంలో ప్రజలు కూడా వారిరువురి పార్టీల మధ్య చీలిపోయున్నారు. కనుక వారిలో ఎవరికి నచ్చిన నేత వాదనని వారు సమర్ధించుకోవచ్చును.