తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవ్వాళ మధ్యాహ్నం 2గంటలకి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన వివిధ ప్రాజెక్టులపై సమీక్ష, రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ 13వ ర్యాంక్ కేటాయించడం, రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు వంటి అనేక అంశాల మీద ఈ సమావేశంలో చర్చించవచ్చునని తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన చైనా పర్యటన వివరాలను మంత్రులకు తెలియజేస్తారు.
అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ముందు నిర్వహిస్తున్న ఈ మంత్రివర్గ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. కనుక ఈ సమావేశంలో చాలా ముఖ్యమయిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు బయలుదేరే ముందే సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించినప్పటికీ, అన్ని అంశాలపై సావధానంగా చర్చించాలనే ఉద్దేశ్యంతో వాయిదా వేశారు. ఈనెల 23నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరుకొంటే అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన ఆ మాటకు కట్టుబడి ఉంటారో లేదో ఇవ్వాళా మంత్రివర్గ సమావేశం తరువాత తెలియవచ్చును.