గత ఏడాది నవంబరులో జరుగవలసిన జి.హెచ్.యం.సి. ఎన్నికలు ఇంతవరకు జరుగలేదు. ఇంకా ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. ఇటువంటి సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జి.హెచ్.యం.సి. ఎన్నికలు 2016 జనవరిలో జరిగే అవకాశం ఉందని శాసనసభ పక్ష సమావేశంలో తన ఎమ్మెల్యేలకు చెప్పారు. జి.హెచ్.యం.సి. పరిధిలో పెరిగిన జనాభాకి అనుగుణంగా డివిజన్ల పునర్విభజన చేయాలనే సాకుతో ఇంతవరకు ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చిన తెరాస ప్రభుత్వం సుమారు ఏడాది గడిచిన తరువాత పునర్విభజనలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి..పరిపాలనాపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెపుతూ ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లలోనే పెరిగిన జనాభాని సర్దేయమని జి.హెచ్.యం.సి.ని ఆదేశిస్తూ కొన్ని వారాల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అటువంటప్పుడు తక్షణమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండా ఇంకా జనవరిలో ఎన్నికలు జరిగే ‘అవకాశం ఉందని’ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం చూస్తుంటే నిజంగా అప్పుడయినా ఎన్నికలు జరిగే అవకాశం ఉందో లేదో అనే అనుమానం కలుగుతోంది.
వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి, నారాయణ్ ఖేడ్ శాసనసభ నియోజక వర్గానికి ఉప ఎన్నికల నిర్వహణ బాధ్యత తెరాస చేతిలో కాక ఎన్నికల సంఘం చేతిలో ఉంది కనుక వాటికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడబోతోంది. వరంగలో లో 67 శాతం, నారానయణ ఖేడ్ లో 52 శాతం మంది ప్రజలు తెరాస వైపే మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలిందని కేసీఆర్ తెలిపారు. అయినప్పటికీ రెండు చోట్ల ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీలో అందరూ సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి దసరా లోపుగా నామినేటడ్ పదవులలో నియమిస్తామనే తీపి కబురు కూడా చెప్పారు. 17 కార్పోరేషన్ లకు చైర్మెన్లుగా నియమించేందుకు అర్హులయిన అభ్యర్ధుల పేర్లను వారంలోగా సూచించమని ఏమ్మేల్యేలను కోరారు.