రాష్ట్రంలో హైకోర్టు ప్రారంభం కావడం ఆంధ్రాకే గర్వించదగ్గర సందర్భమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధానిలో హైకోర్టు భవనాన్ని సీజేఐ రంజన్ గొగోయ్ ప్రారంభించారు. శాశ్వత భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విభజన వల్ల చాలా సమస్యలు వచ్చాయనీ, చివరికి విభజన చట్టంలోని అంశాలను కూడా ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విభజన తరువాత పంపకాలు కూడా పూర్తిగా జరగలేదన్నారు. ఈ ప్రాంత రైతులను ఈసందర్భంగా అభినందిస్తున్నాననీ, వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు 34 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చారన్నారు. రైతులు చొరవ చూపకపోయి ఉంటే, ఈరోజున ఇదంతా జరిగి ఉండేది కాదన్నారు. అమరావతికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందనీ, అప్పట్లో శాతవాహనుల రాజధానిగా ఉండేదనీ, ఆ చారిత్రక ఔన్నత్యాన్ని మరోసారి తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు.
అభివృద్ధితోనే అవకాశాలు వస్తాయనీ, పేదరికాన్ని తగ్గించొచ్చనీ సంక్షేమం కూడా సాధ్యమని అన్నారు. ప్రస్తుతం సమస్యలున్నాయనీ, వాటిని అవకాశాలుగా మార్చుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కారాలు చూపించాలంటూ ఈ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి కోరారు. నల్సార్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలనీ, దానికి కావాల్సిన భూమి, నిర్మాణ నిధులును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని న్యాయమూర్తులను సీఎం కోరారు. కోర్టు ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి, మొదట్లో కొన్ని చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయనీ, అయితే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తులు, జడ్జిలు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం చెప్పారు. హైకోర్టు ఉద్యోగులను నివాసంతోపాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.
విభజన తరువాత చాలా సమస్యలు ఎదుర్కొన్నామనీ, ఇప్పుడిప్పుడే వాటిని తట్టుకుని ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. చివరిగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ… అమరావతిలో ఈరోజున ఇంత పెద్ద ఎత్తున ఫంక్షన్ పెట్టుకున్నామంటే కారణం రైతులు అన్నారు. రైతులు చొరవ చూపించి భూమి ఇవ్వకపోయి ఉంటే.. ఇది సాధ్యమయ్యేది కాదనీ, ఈ సందర్భంగా రైతులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అన్నారు. ప్రసంగం చివర్లో ఇలా రైతులను గుర్తు చేసుకోవడం, వారి త్యాగాల గురించి మాట్లాడటం బాగుంది.