పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్రాల్లో పరిస్థితులపై ప్రధాని కాస్త దృష్టి సారించారనే చెప్పాలి. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకుంటూనే, ఉపశమన చర్యల్లోగా భాగంగా నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు చర్యలు చేపట్టందుకు కూడా సిద్ధపడ్డారు. దీన్లో భాగంగా మోడీ సర్కారు ఐదుగురు ముఖ్యమంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు హడావుడిగా ప్రకటించేసింది. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సారథ్య బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా ఫోన్ చేసి మరీ కోరారు. దాంతో తెలుగుదేశం వర్గాలు కూడా గర్వంగా ఫీల్ అయ్యాయి. అయితే, ఆ కమిటీ పరిస్థితి ఏంటి, దాని లక్ష్యాలేంటి, ఇంతకీ ఆ కమిటీ నుంచి కేంద్రం ఆశిస్తున్నదేంటీ… ఇలాంటి కీలకాంశాలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. నిజం చెప్పాలంటే… తొలినాడు కమిటీ ప్రకటించి, మర్నాడు దాని గురించి కేంద్రం కూడా మాట్లాడటం మానేసింది.
ఇంకా చిత్రమేంటంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఈ కమిటీకి సంబంధించి కేంద్రం నుంచి అప్డేట్స్ ఏవీ లేవని అంటున్నారు. అంతేకాదు, మొత్తం ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ కమిటీని వేశారు కదా! వారిలో ఇప్పటికే ముగ్గురు కమిటీలో కొనసాగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం విశేషం! ఆ కమిటీలో సభ్యుడిగా కొనసాగే ప్రసక్తే లేదని ముగ్గురు ముఖ్యమంత్రులు కుండబద్దలు కొట్టేశారు. అందుకు వారు చెప్పిన కారణాలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. ఇలాంటి పెద్దపెద్ద వ్యవహారాలపై తనకు అవగాహన లేదంటూ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు సైడైపోయారు. పెద్ద నోట్ల రద్దు తరువాత చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాబట్టి, ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్న ఉద్దేశంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తప్పుకున్నారు! పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో కమిటీలో కొనసాగను అనేశారు.
ఇక, మిగిలింది ఎవరయ్యా అంటే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు! ఐదుగురు ముఖ్యమంత్రులు కమిటీలో ఉంటారనుకుంటే ఆఖరికి ఇద్దరు మిగిలారు. శివ్‌రాజ్ సింగ్ భాజపా సీఎం కాబట్టి ఆయనకు తప్పదు! భాజపాకు అవసరమైన సీఎం చంద్రబాబు కాబట్టి ఈయనకూ తప్పదు! సో.. కేంద్రం తీసుకున్న అతి కీలకమైన నిర్ణయంగా అభివర్ణింపబడ్డ ఈ ముఖ్యమంత్రుల కమిటీ ఇలా నీరుగారిపోయే దశకు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. మరి, ఈ కమిటీని ఇలా చల్లార్చేస్తారా… కొత్త సభ్యులను ప్రకటించి బలోపేతం చేస్తారా అనేది అనుమానాస్పదంగానే ఉంది!