సీపీ అంజనీ కుమార్ మీద తీవ్ర పదజాలంలో విమర్శలకు దిగారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోపాటు, పార్టీలో ఉన్న అందర్నీ బాధపెట్టే విధంగా ఆయన ప్రవర్తన ఉందని విమర్శించారు. గాంధీభవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ పాదయాత్ర చేస్తామని అనుమతి కోరితే ఇవ్వలేదనీ, ఇది నాన్ నోటిఫైడ్ రోడ్డనీ, దీని మీద యాత్ర చేస్తే ప్రజలకు ఇబ్బందులు వస్తాయని అభ్యంతరాలు చెప్పారన్నారు. దాంతో, మీరు ఎటువైపు నుంచి వెళ్లమని అనుమతిస్తే, అటే పోతామని కూడా తాను జవాబు ఇచ్చానన్నారు. ప్లకార్డులు పట్టుకుని, శాంతియుతంగా, ఎలాంటి నినాదాలూ చెయ్యకుండా పోతామని చెప్పినా అనుమతి ఇవ్వలేదన్నారు.
అంజనీ కుమార్ పూర్తిగా దిగజారిపోయి పనిచేస్తున్నారన్నారు. ఆర్.ఎస్.ఎస్. యాత్ర చేస్తామంటే రోడ్లు ఖాళీ చేసి ఇస్తారనీ, కాంగ్రెస్ అనుమతి అడిగితే అభ్యంతరాలు చెప్పారన్నారు. ఎమ్.ఐ.ఎమ్. మీటింగ్ అంటే పర్మిషన్లు ఇస్తారన్నారు. మా పార్టీ ఆవిష్కరణ సభలో జెండా ఎగరేసుకునేందుకు వచ్చిన కార్యకర్తల్ని అరెస్టు చేసే దమ్మూ ధైర్యం నీకు ఎక్కడ్నుంచి వచ్చిందన్నారు. ఉద్యోగం చేయడానికి వచ్చినావ్, ఉద్యోగం చేసుకుని చక్కగా పో అన్నారు. అన్ ఫిట్ పోలీస్ కమిషనర్, దిగజారినోడు, అవినీతిపరుడు, కేరెక్టర్ లెస్ ఫెలో అంజనీ కుమార్ అంటూ ఆవేశంగా ఉత్తమ్ మండిపడ్డారు. చాలా గలీజ్ అలవాట్లున్నోడనీ, ఇలాంటి అధికారిని ఇక్కడ ఉంచొద్దని గవర్నర్ కి వినతి ఇవ్వబోతున్నామన్నారు. ఈయన పేరు వెనక ఉన్న ఐ.పి.యస్. తీసేసి కె.పి.యస్., కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అని పెట్టుకుంటే బెటర్ అంటూ ఎద్దేవా చేశారు.
విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో శాంతిభద్రతల బాధ్యత గవర్నర్ కి ఉంటుందనే అంశాన్ని ఉత్తమ్ గుర్తుచేశారు. అందుకే, గవర్నర్ కి సీపీ మీద ఫిర్యాదు చేస్తా అంటున్నారు. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కి లా అండర్ ఆర్డర్ మీద స్పష్టమైన అధికారాలున్నాయని గుర్తుచేస్తామన్నారు ఉత్తమ్. ఇంత ఆవేశానికి కారణం… కేంద్ర నిర్ణయాలను నిరసిస్తూ ర్యాలీ చేస్తామని కాంగ్రెస్ నేతల కోరడమే. నిజానికి, గడచిన వారం రోజులుగా అనుమతుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నా… వరుసగా పోలీసులు నిరాకరిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం, సాధారణ జన జీవనానికి అడ్డంకి అని రొటీన్ కారణాలే చెబుతూ వస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఆర్.ఎస్.ఎస్. సభలకీ ర్యాలీలకీ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అనుమతులు ఇచ్చేసరికి… కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. మొత్తానికి, సీపీ అంజనీ కుమార్ మీద ఉత్తమ్ చాలా ఘాటుగానే విమర్శలు చేశారు. దీనిపై ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి.