కేసినో వ్యవహారాలతో వెలుగులోకి వచ్చిన చీకోటి ప్రవీణ్ రోజుకో విషయంలో హైలెట్ అవుతున్నారు. ఆయనకు తాజాగా ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. మూడు కోట్ల విలువ చేసే కారు కొనుగోలు వ్యవహారంలో ప్రవీణ్‌కు నోటీసులిచ్చింది. భాటియా ఫర్నిచర్ పేరుతో ప్రవీణ్ కారును కొనుగోలు చేయడంతో.. కారును ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ ఐటీ శాఖ షోకాజ్ నోటీస్ పంపింది. ఇప్పటికే చికోటి ప్రవీణ్ ఫెమా కేసును ఎదుర్కొంటున్నారు. ఈ రూ. మూడు కోట్లు పెట్టి కారును.. బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఇప్పుడీ నగదు ఎక్కడిది అని ఐటీ శాఖ వర్గాలు ఆరా తీస్తే అసలు విషయం బయటపడుతుంది.
అది బినామీదని చీకోటి ప్రవీణ్ చెప్పుకోలేరు. నిజం ఒప్పుకుంటే మరింత లోతుగా ఐటీ దర్యాప్తు చేస్తుంది. అటూ ఇటూ కాకుండా చీకోటి ఇరుక్కుపోయారన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలే ఆయన కారును ఒకరు చోరీ చేశారు. ఈ చోరీ సామాన్యంగా జరిగింది కాదని..దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని ఆయన మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని.. తన రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకోవడానికే ఇలా చేశారని ఆరోపించారు.
కేసినో వ్యవహారంపై ఇప్పటికీ విచారణ జరుగుతోంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా కూడా ఏపీలో పెద్ద ఎత్తున కేసినోలు..ఇతర జూద క్రీడలు తన మనుషులతో ఏర్పాటు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కారు కేంద్రంగా చీకోటి వ్యవహారాలు వెలుగులోకి తీసుకు వస్తే చాలా మంది రాజకీయ నేతల వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.