కేసినో కింగ్‌గా పేరు పొంది రాజకీయ నేతల జూద అవసరాలు తీరుస్తున్న చీకోటి ప్రవీణ్ ధాయ్ ల్యాండ్‌లో అరెస్టయ్యాడు. పట్టాయలో ఓ లగ్జరీ హోటల్లో కన్వెన్షన్ హాల్ ను బుక్ చేసుకుని ఇండియా నుంచి 83 మంది గ్యాంబ్లర్లను తీసుకెళ్లి జూదం ఆడిస్తున్నాడు. విషయం అక్కడి పోలీసులకు తెలియడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అందర్నీ జైలుకు పంపారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది.
మొత్తం 83 మంది హోటల్లో ఓ సెటప్ ఏర్పాటు చేసుకుని గ్యాంబ్లింగ్ ఆడుతున్న విషయంపై సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారని తెలిపింది. కొంత మంది పారిపోవడానికి ప్రయత్నించినా దొరికిపోయారని తెలిపింది. వీరికి సంబంధించిన ఫోటోలను కూడా ద నేషన్ ధాయిల్యాండ్ పత్రిక ప్రచురించింది. ద నేషన్ ధాయిల్యాండ్ పత్రిక రిలీజ్ చేసిన ఫోటోల్లో ఉన్న వారంతా తెలుగు రాష్ట్రానికి చెందిన వారే. గతంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసుల్లో ఈడీ ప్రశ్నించిన వారే ఎక్కువగా ఉన్నారు. మాధవరెడ్డి అనే వ్యక్తితో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా పోలీసులకు పట్టుబడిన ఫోటోల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. గేమింగ్ చిప్స్ విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.గ్యాంబ్లింగ్ కు మించి ఏదో చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పన్నెండు మంది మహిళలు కూడా పట్టుబడటం.. అసలు వెళ్లిన వారు అంతా ఎవరు అన్నదానిపై చర్చజరుగుతోంది. వారందరి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.