చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ ఖరీదైన బెంజ్ కారుతో… ఢీకొట్టి ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత కనీసం.. ఆ యువకుడ్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయకుండా.. అక్కడ్నుంచి వెళ్లిపోయి.. ప్రజాప్రతినిధి అని చెప్పుకోవడానికి కొత్త అర్థం తీసుకు వచ్చారు. ఆమె తీరు ఇప్పుడు… హాట్ టాపిక్ అవుతోంది. ఎంత ఎన్నారై అయితే మాత్రం.. ప్రమాదానికి గురి చేసింది కాక.. చావుబతుకుల్లో ఉన్నవారిని.. అలా వదిలేసి వెళ్లిపోవడం ఏమిటన్న ఆగ్రహం… అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది.
రోడ్డు మీద వెళ్తూంటే.. ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయితే.. కనీసం అంబులెన్స్‌కు ఫోన్ చేసే సాయం అయినా చేయడం.. కనీస మానవత్వం. అది సామాన్య ప్రజలందరిలో కనిపిస్తుంది. ఇక ప్రజాసేవకే అని రాజకీయాల్లోకి వచ్చిన వారిలో ఆ గుణం మరింత ఎక్కువగా ఉండాలి. ఇటీవలి కాలంలో.. అనేక మంది ప్రజాప్రతినిధులు.. తాము వెళ్తున్న రోడ్డుపై ప్రమాదాలు జరిగినట్లు కనిపిస్తే.. వెంటనే.. తమ కాన్వాయ్‌లో వాహనమో.. లేకపోతే.. సొంత వాహనమో.. ఇచ్చి.. ఆస్పత్రికి పంపించిన ఘటనలు.. చాలా మీడియాలో వచ్చాయి. తర్వాత ఎవరి తీరికను బట్టి వారు.. వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం లాంటివి చేశారు. అలా జరిగినప్పుడు.. వాళ్లను మానవతా వాదులుగా చెప్పుకున్నాం. కానీ ఆ ప్రమాదానికి కారణమయ్యి.. బాధితుల్ని కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయిన ప్రజాప్రతినిధిని ఎలా చెప్పుకోవాలి..?
గుంటూరు నుంచి అసెంబ్లీకి వెళ్లే దారిలో.. నిడమర్ర రోడ్డు, బాపూజీ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న నవీన్ అనే యువకుడ్ని… ఓ ఖరీదైన బెంజ్ కారు.. ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో.. ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ కారు.. చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీది. ప్రమాదానికి గురైన తర్వాత ఆమె నింపాదిగా కారు దిగి… గాయపడిన వ్యక్తివైపు కనీసం చూడకుండా.. అటుగా వస్తున్న ఆటోను మాట్లాడుకుని వెళ్లిపోయారు. గన్మెన్లు కూడా… అదే దారి చూసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు నిర్లక్ష్యంగా అలా వెళ్లిపోవడంతో.. చాలా సేపు.. ఆ గాయపడిన వ్యక్తి బాధతో విలవిల్లాడుతూనే ఉండిపోయాడు. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం అందించి… ఆస్పత్రికి తరలించారు.
నవీన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయన దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. తల్లిదండ్రులు చనిపోవడంతో.. కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఓ నిరుపేద యువకుడి జీవితాన్ని యాక్సిడెంట్‌తో ఆస్పత్రి పాలు చేసిన .. ఎమ్మెల్యే … కనీసం మానవత్వం కూడా చూపకుండా.. అక్కడ్నుంచి వెళ్లిపోవడం.. అందర్నీ నివ్వెర పరుస్తోంది. ప్రజాసేవ చేస్తామంటూ.. ప్రజాజీవితంలోకి వచ్చిన వీరు.. తమ వల్ల .. ప్రమాదం జరిగినా.. కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడం… జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన వల్ల జీవితాలు నాశనమైపోతున్నా.. పట్టించుకోని ఆమె.. ఇక సాధారణ ప్రజలకు ఏమి సేవ చేస్తారన్న చర్చ.. అక్కడ ప్రజల్లో ప్రారంభమయింది.