‘ఒక్క ఛాన్స్… ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ సినిమా ఆఫీసుల చుట్టూ ఫొటో ఆల్బమ్స్ పట్టుకుని తిరగడం పాత జమానా. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌లో ఫొటోలు పోస్ట్ చేసి ఛాన్సులు అందుకోవడం నయా జమానా. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించిన సినిమా ‘చి.ల.సౌ’లో హీరోయిన్ రుహాని శర్మకు అలాగే అవకాశం వచ్చింది మరి! గతంలో కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేసిన ఈ హిమాచల్ ప్రదేశ్ అమ్మాయికి హీరోయిన్గా ఇదే తొలి సినిమా. ఇందులో ఈ అమ్మాయికి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతోన్న ‘అందాల రాక్షసి’ ఫేమ్, హీరో రాహుల్ రవీంద్రన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రుహాని శర్మ ఫొటోలు చూశార్ట. చూశాక ఓసారి ఆడిషన్‌కి రమ్మని పిలుపు వచ్చింది. తర్వాత సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ముప్ఫై ఏళ్లు దాటిన ఓ అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు పరిచమైన ఒక్కరోజులోనే ప్రేమలో ఎలా పడ్డారు? పెద్దలను ఒప్పించి పెళ్లి ఎలా చేసుకున్నారు? అనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అర్జున్ పాత్రలో సుశాంత్, అంజలి పాత్రలో రుహాని శర్మ నటించారు. నిజానికి ఈ సినిమా జూలై 27న విడుదల కావాలి. ప్రస్తుతం ఆగస్టు 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.