‘అందాల రాక్షసి’ ఫేమ్, హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘చి.. ల.. సౌ’. పెళ్లి శుభలేకలో చిరంజీవి లక్షీ సౌభాగ్యవతి అని రాస్తారు కదా. దానికి సంక్షిప్త రూపం అన్నమాట. మన సినిమా విషయానికి వస్తే… చిరంజీవి అర్జున్ పాత్రను అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ చేశాడు. అతడి పక్కన నటించిన లక్ష్మీ సౌభాగ్యవతి ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే… టీజర్లో చిరంజీవి సుశాంత్ మాత్రమే చూపించారు. పెళ్లికొడుకు వెర్షన్ టీజర్ అన్నమాట. ఇందులో కథేంటో క్లారిటీగా చెప్పేశాడు రాహుల్ రవీంద్రన్. పెళ్లి అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి కథే ఈ సినిమా. ‘ఏ దేవుణ్ణి ఏం మొక్కుతున్నావ్’ అనే డైలాగ్ బాగుంది. ‘వెన్నెల’ కిషోర్ క్యారెక్టర్ ద్వారా సరైన వయసులో పెళ్లి చేసుకోకపోతే ఎలా వుంటుందో చెప్పించాడు. “నాలుగేళ్ల క్రితం మా పేరెంట్స్ అడిగార్రా (పెళ్లి చేసుకోమని). ‘అప్పుడే పెళ్లేంటి?’ అన్నాను. ఇప్పుడు అడిగితే ‘ఇప్పుడు పెళ్లేంట్రా’ అంటున్నారు” అని ‘వెన్నెల’ కిషోర్ చెప్పే డైలాగ్ టీజర్‌కి హైలైట్. దర్శకుడిగా తొలి సినిమా అయినప్పటికీ టీజర్లో భలే సిట్యువేషన్స్ చూపించాడు రాహుల్ రవీంద్రన్. జనాలకు సినిమాపై దీంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.