హైదరాబాద్: పెరిగిపోతున్న జనాభాను నియంత్రించటంకోసం దశాబ్దాలుగా అనుసరిస్తున్న ‘ఒకే సంతానం’ విధానాన్ని చైనా ప్రభుత్వం సడలించనుంది. 1970వ దశకంలో ప్రవేశపెట్టిన ఒకే సంతానం విధానం ఇప్పటి పరిస్థితులకు సరిపోదని పలువురు మేధావులు చేసిన విజ్ఞప్తులు, దేశంలో కార్మికుల సంఖ్య తగ్గిపోవటంవంటి కారణాలతో ఈ మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. ఇవాళ జరిగిన అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనితో ఇక జంటలు ఇద్దరు సంతానాన్ని కనటానికి ఆమోదం లభించినట్లే. గతంలో ఒక్క సంతానం నిబంధనను అతిక్రమించినవారికి జరిమానా దగ్గరనుంచి ఉద్యోగంనుంచి తొలగించటంవరకు అనేక శిక్షలు విధించేవారు. వాస్తవానికి 2013 సంవత్సరంనుంచే ఒక్క సంతానం నిబంధనను కొద్దిగా సడలించారు. ఇక కొత్త నిర్ణయం ఎప్పటినుంచి అమలవుతుందనేదానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
అయితే ఈ నిర్ణయం చాలా ఆలస్యంగా తీసుకున్నారని, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని విమర్శలు వినబడుతున్నాయి. కార్మికుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుండగా, వృద్ధులసంఖ్య పెరిగిపోతోందని, ఒక్క సంతానం నిబంధన దుష్ఫలితాలను తిప్పికొట్టటానికి ఈ ఒక్క నిర్ణయమే సరిపోదని, మరికొన్ని చర్యలు అవసరమని అంటున్నారు. మరోవైపు జనాభా గణాంకాల నిపుణుడు వాంగ్ ఫెంగ్ ఈ మార్పుపై వ్యాఖ్యానిస్తూ, ఇది ఒక చారిత్రక ఘట్టమని అన్నారు. కొన్నేళ్ళుగా దీనికోసమే తామంతా ఎదురుచూస్తున్నామని, అయితే చాలాకాలం వేచిచూడాల్సివచ్చిందని వ్యాఖ్యానించారు. చైనాలో పెరిగిపోతున్న వృద్ధుల సమస్యలనుమాత్రం ఈ నిర్ణయం ఏమీ పరిష్కరించలేదని అన్నారు.