ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో పలు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే, ఈ ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని చైనా నుండి కొన్ని సైబర్ గ్రూపులు ఎఐ టెక్నాలజీతో సోషల్ మీడియాలో విష ప్రచారానికి రెడీ అయ్యాయి అంటూ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ బాంబు పేల్చింది.
2024లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలను చైనా నుండి పనిచేసే కొన్ని విధ్వంసకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని… నార్త్ కొరియాతో టీమ్స్ తో కలిసి చైనా సైబర్ సంస్థలు ఇండియా ఎలక్షన్స్ ను టార్గెట్ చేసినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
ఎఐ టెక్నాలజీతో తయారు చేసిన డీప్ ఫేక్ వీడియోలు, అసత్య ప్రచారాలను ఈ సంస్థలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తాయి. ఎన్నికలను ప్రభావితం చేసేలా చేస్తాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేసి, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి.
గతంలో తైవాన్ ఎన్నికలను ప్రభావితం చేసేలా చైనా సైబర్ సంస్థలు పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇండియా ఎన్నిలను కూడా ఎఐ టెక్నాలజీతో ప్రభావితం చేయబోతున్నాయని టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అనుమానం వ్యక్తం చేసింది.
ఇండియాలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా… జూన్ 4న ఫలితాలను ప్రకటించబోతున్నారు.