ఇప్పుడే దేశంలో ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక చైనా వస్తువు కనిపిస్తుంటుంది. అలాగే పల్లెలు, పట్టణాలు నగరాలు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా చైనా వస్తువులు అమ్మే షాపులు కనిపిస్తూనే ఉంటాయి. కాలికి వేసుకొనే చెప్పులు మొదలుకొని ఫ్యాన్లు లైట్ల వరకు అన్నీ ‘మేడ్ ఇన్ చైనా’ వస్తువులే కనిపిస్తున్నాయి. ఈ మేడ్ ఇన్ చైనా వస్తువులు ప్రపంచ మార్కెట్లని ఆక్రమించి చాలా కాలమే అయ్యింది. వాటి పోటీ తట్టుకోలేక దేశీయ ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతున్నా కూడా చైనా వస్తువులు చవకగా దొరుకుతున్న కారణంగా ప్రజలు వాటిని ఆదరిస్తున్నారు. భారత్ లో అయితే చైనా వస్తువులేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. సుమారు 125 కోట్ల జనాభా ఉన్న భారత్ ఏ దేశానికయినా అతిపెద్ద మార్కెట్ వంటిదే కనుక చైనా కూడా ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే వివిధ ఉత్పత్తులను భారత్ లో అమ్ముకొని లాభాలు ఆర్జించుకొంటోంది. కానీ ఇప్పుడు దానికి కేంద్రప్రభుత్వం బ్రేక్ వెయ్యబోతున్నట్లు తాజా సమాచారం.
పఠాన్ కోట్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జైష్-ఏ-మొహమ్మద్ సంస్థ అధినేత మౌలానా మసూద్ అజహర్ పై నిషేధం విధించాలని భారత్ చేసిన అభ్యర్ధనను మొన్న ఐక్యరాజ్యసమితి అంగీకరించబోతుంటే, చైనా తనకున్న ‘వీటో పవర్’ విశేష హక్కుతో దానిని అడ్డుకొంది. దానితో అతను నిషేధం నుంచి త్రుటిలో తప్పించుకొన్నట్లయింది. భారత్ కి పక్కలో బల్లెంలాగ తయారయినందునే పాకిస్తాన్ దేశాన్ని మిత్ర దేశంగా భావిస్తున్న చైనా, దాని అభ్యర్ధన మేరకే మసూద్ అజహర్ పై వేరు పడకుండా అడ్డుకొందనే సంగతి స్పష్టంగా కనబడుతూనే ఉంది. అయితే ఐక్యరాజ్యసమితిలో చైనాకి వీటో పవర్ ఉన్న కారణంగా అది అతనిపై నిషేదాన్ని అడ్డుకొన్నప్పుడు భారత్ ఏమీ చేయలేకపోయింది.
ప్రధాని నరేంద్ర మోడి భారత్ తిరిగి వస్తూనే చైనాకి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఆ దేశం నుంచి భారత్ లోకి దిగుమతి అవుతున్న వస్తువులపై ఆంక్షలు విధించడానికి అవసరమయిన చర్యలు చేపడుతున్నట్లు తాజా సమాచారం. అదే జరిగితే ఒక ఉగ్రవాదిని, దానికి ఆశ్రయం ఇస్తున్న దేశాన్ని కాపాడేందుకు చైనా చాలా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. దీని వలన మరో ప్రయోజనం కూడా ఉంటుంది. భారత్ లో వివిధ ఉత్పత్తుల అమ్మకాలు మళ్ళీ గణనీయంగా పెరుగుతాయి. దాని వలన దేశీయ ఉత్పత్తి రంగం మళ్ళీ పుంజుకొంటుంది. చైనాకి బుద్ధి చెప్పడం కోసం కాకపోయినా దేశియ సంస్థలను కాపాడుకోవడానికైనా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అత్యవసరం.