హైదరాబాద్: క్యాపిటలిస్ట్ దేశమైన అమెరికాకంటే కమ్యూనిస్ట్ దేశమైన చైనాలోనే ఎక్కువమంది బిలియనీర్లు ఉన్నట్లు తాజా గణాంకాలలో తేలింది. ఈ విషయంలో అమెరికాను చైనా అధిగమించటం ఇదే ప్రథమం. చైనా ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉన్నాకూడా బిలియనీర్ల సంఖ్య పెరగటం సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలో 537 మంది బిలియనీర్లు ఉండగా చైనాలో 596 మంది బిలియనీర్లుఉన్నారు. ఇదికాక హాంకాంగ్, మకావులలో ఉన్న 119 మంది బిలయనీర్లను చేర్చితే చైనా సంఖ్య 717కు చేరుతుంది.
చైనా అభివృద్ధి రేటును వరల్డ్ బ్యాంక్ ఇటీవల 7.1% నుంచి 6.9%కు తగ్గించగా, బిలియనీర్ల సంఖ్యమాత్రం 32% పెరగటం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనాలో ఇటీవల టెక్నాలజీ, మేన్యుఫాక్చరింగ్ రంగాలలో అద్భుత విజయాలు సాధించినవారివలన ఈ సంఖ్య పెరిగిందని దీనిపై అధ్యయనం చేసిన హురూన్ సంస్థ నిపుణులు చెబుతున్నారు. చైనాలోని 1,877 మంది సూపర్ రిచ్ వ్యక్తుల మొత్తం సంపద 2.1 ట్రిలియన్ డాలర్లని తేల్చారు. ఇది అనేక దేశాల స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) కంటే అధికంకావటం విశేషం. సంప్రదాయ రంగాలైన ఉక్కు, సహజ వనరుల పరిశ్రమల వ్యాపారం తగ్గిపోగా, ఆన్లైన్ రీటైలింగ్, ఎంటర్టైన్మెంట్, ఇతర సేవారంగాల వ్యాపారం గణనీయంగా పెరిగింది.