పఠాన్ కోట్ తో సహా భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారిగా గుర్తించిన జైష్-ఏ-మొహమ్మద్ సంస్థ అధినేత మౌలానా మసూద్ అజహర్ ని అప్పగించాలని భారత్ చాలా కాలంగా పాకిస్తాన్ని కోరుతోంది కానీ పాక్ అందుకు అంగీకరించడం లేదు. అతను నేటికీ పాక్ ప్రభుత్వ రక్షణలో పాకిస్తాన్ లోను, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోను స్వేచ్చగా తిరుగుతున్నాడు. రెండు నెలల క్రితం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిర్వహించిన ఒక భారత వ్యతిరేక బహిరంగ సభలో అతను మాట్లాడుతూ ‘భవిష్యత్ లో పఠాన్ కోట్ దాడుల కంటే భయంకరమయిన దాడులు చేసి చూపిస్తామని’ భారత్ ని హెచ్చరించాడు. ప్రస్తుతం అతనిని గృహ నిర్బంధంలో ఉంచినట్లు పాక్ ప్రభుత్వం చెపుతోంది కానీ అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. అటువంటి కరడు గట్టిన ఉగ్రవాదిపై నిషేధం విధించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ ఐక్యరాజ్యసమితి కమిటీ అందుకు సిద్దమవుతుంటే, నిన్న ఆఖరు నిమిషంలో చైనా అడ్డుపడినట్లు తెలుస్తోంది. అతనిపై నిషేధం విధించవద్దని, ఆ నిర్ణయం మరికొంత కాలం వాయిదా వేయమని ఐక్యరాజ్యసమితి కమిటీని చైనా కోరినట్లు తెలుస్తోంది. దీని గురించి ఐక్యరాజ్యసమితి ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.
ఉగ్రవాది మసూద్ అజహర్ కి పాక్ ప్రభుత్వం తన గడ్డపై ఆశ్రయం, రక్షణ, పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందనే విషయం బహిరంగ రహస్యమే. అందుకు దాని కారణాలు దానికి ఉండవచ్చును. అయితే అతనిపై నిషేధం విధించవద్దని పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిని నేరుగా కోరితే, అది అతనికి అండగా నిలుస్తోందనే భారత్ వాదనను దృవీకరించినట్లవుతుంది కనుక తన మిత్రదేశం అయిన చైనా ద్వారా అతనిపై నిషేధం విధించకుండా అడ్డుపడి ఉండవచ్చును లేకుంటే చైనాకి ఆ అవసరమే లేదు.
ప్రధాని నరేంద్ర మోడి మొన్న బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, ‘ఉగ్రవాదానికి, దాని మద్దతుదారులని గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి తక్షణమే నిర్వచిస్తూ ఒక ప్రకటన చేయాలని లేకుంటే అది దాని ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని’ హెచ్చరించారు. ఈ మాట అన్న రెండు రోజులకే కరడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించాలని ప్రయత్నించడం, దానిని చైనా అడ్డుకోవడం జరిగింది.