హైదరాబాద్: చైనాకు చెందిన షాంఘై డ్రాగన్ టీవీ అనే న్యూస్ ఛానల్ తమ లైవ్ బ్రేక్ఫాస్ట్ షో కోసం ఒక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రోబోను న్యూస్ రీడర్గా పెట్టుకుంది. దీనితో చైనాలో న్యూస్రీడర్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఉద్యోగాలు ఎమవుతాయోనని హడలి చస్తున్నారు. మొన్న మంగళవారం, షియావో ఐసి అనే ఆ మహిళా రోబో వెదర్ రిపోర్ట్ చదివే న్యూస్ రీడర్గా తన పనిని ప్రారంభించింది. షియావో ఐస్ అనేది స్మార్ట్ క్లౌడ్, బిగ్ డేటా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్. షియావో ఐస్ మొదటి రెండు రోజుల తన పనిలో తియ్యని గొంతుతో అందరినీ అలరించింది. టెక్స్ట్ టు స్పీచ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానం ద్వారా షియావో ఐస్ గొంతు సహజంగా, మానవ స్వరంలాగ అనిపించేటట్లు చేయగలిగామని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. అయితే న్యూస్ రీడర్ వృత్తిలో ఉన్న వ్యక్తులు మాత్రం ఈ పరిణామంతో బెంబేలెత్తుతున్నారు. షాంఘై డ్రాగన్ టీవీ యాజమాన్యం దీనిపై వివరణ ఇస్తూ, మానవ యాంకర్లను తొలగించే ఉద్దేశ్యం ఇప్పట్లో లేదని తెలిపింది. న్యూస్ రీడర్ రోబోలను జపాన్ సైంటిస్టులు గత ఏడాదే తయారు చేశారు. కొడోమొరాయిడ్ అనే ఆ రోబోను ఆండ్రాయిడ్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ రోబో రకరకాల స్వరాలతో రకరకాల భాషలను మాట్లాడగలదు.