హైదరాబాద్: ఏపీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై నిప్పులు చెరిగారు. నిన్న తునిలో జరిగిన విధ్వంసం వెనక తెలుగుదేశం ఉందని ముద్రగడ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ముద్రగడలాంటి పెద్దమనిషి అలా మాట్లాడకూడదని అన్నారు. ఇది సమంజసం కాదని చెప్పారు. కాపు కమిషన్ వేసి తమ ప్రభుత్వం చిత్తశుధ్ధిని నిరూపించుకున్నామని అన్నారు. వైసీపీ ముసుగులోనే ముద్రగడ ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. నిన్నటి అల్లర్లలో వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. నిన్నటి సభకు వైసీపీ నేత కరుణాకరరెడ్డి ఆర్థికసాయం చేశారని చెప్పారు. కాపులు ముద్రగడను నమ్మొద్దని పిలుపునిచ్చారు. కాపులకు రిజర్వేషన్ విషయమై ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని చెప్పారు. జీఓ ఇవ్వటానికి అభ్యంతరం లేదని, కానీ అది నిలబడదని అన్నారు. ముద్రగడకు ప్రతిసారీ నిరాహారదీక్ష చేయటం, బెదిరించటం అలవాటుగా మారిందని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే బాధ్యత ప్రభుత్వానిదని, కాపులు దీనిని నమ్మాలని అన్నారు. ముద్రగడ ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు.