ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి ఎన్. చినరాజప్ప నిన్న కృష్ణా జిల్లాలో బందరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో నిన్న మాట్లాడుతూ “తునిలో జరిగిన విద్వంసంతో సంబంధం లేని స్థానిక ప్రజలు, ఇతరులపై సానికి పోలీసులు కేసులు నమోదు చేసి, వేధింపులకు పాల్పడుతున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అది నిజం కాదు. తుని విద్వంసంపై సి.ఐ.డి. దర్యాప్తు చేసి, విద్వంసానికి పాల్పడినవారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తోంది. వారిపైనే చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాము తప్ప అమాయకులయిన ప్రజలను వేధించాల్సిన అవసరం ప్రభుత్వానికి, పోలీసులకి లేదు,” అని చెప్పారు.
కాపులకు రిజర్వేషన్లుకోరుతూ ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం ఇటీవల కశింకోటలో జరిగిన కాపు నేతల సమావేశంలో పాల్గొన్నప్పుడు, పోలీసులు స్థానిక ప్రజలపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ రోజు జరిగిన ఘటనలకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని కనుక పోలీసులు తనను ప్రశ్నించవచ్చని చెప్పారు. హోం మంత్రి చిన రాజప్ప బహుశః ఆయనకు జవాబుగా ఈ విధంగా చెప్పి ఉండవచ్చును. తుని ఘటనలకు తానే బాధ్యుడనని, పోలీసులు తనను ప్రశ్నించవచ్చని ముద్రగడ స్వయంగా చెప్పినప్పటికీ పోలీసులు ఆయన జోలికి వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు.