తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సత్ఫలితాలను సాధిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు హామీలివ్వగా మరికొన్ని ఎం ఒ యు కుదుర్చుకున్నాయి.
తెలంగాణలో ఎల్ ఇ డి యూనిట్ ఏర్పాటుకు ఎం ఒ యు కుదిరింది. ప్రసిద్ధ షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్ కూడా తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సంసిద్దత తెలిపింది. ఇంకా మరికొన్ని కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.
వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో కేసీఆర్ ప్రసంగం పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకుంది. 15 రోజుల్లో అనుమతులిచ్చే విధానం తెలంగాణలో అమల్లో ఉందని తెలిసి చాలా మంది పారిశ్రామిక వేత్తలు మెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ముఖ్యమంత్రుల భాగస్వామ్యంతో దేశ అభివృద్ధికి టీమిండియా చేస్తున్న ప్రయత్నాన్ని కేసీఆర్ వివరించారు.
తెలంగాణలో పరిశ్రమలు స్థాపిస్తే ప్రయోజనాలను కేసీఆర్ వివరిస్తున్నారు. అపారమైన ల్యాండ్ బ్యాంక్ తెలంగాణకు ప్లస్ పాయింట్. అలాగే బ్రిక్స్ బ్యాంక్ ప్రతినిధుల సమావేశంలోనూ ఆయన తెలంగాణ ప్రత్యేకతలు వివరించారు. రాష్ట్రం తలపెట్టిన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరారు. ముఖ్యంగా చైనాలో కీలక పారిశ్రామిక నగరమైన షాంఘైపై కేసీఆర్ దృష్టి పెట్టారు. అక్కడి నుంచి భారీగా పెట్టుబడులు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.