ఒక్క ఏడాదికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్‌ను డ్రీమ్ 11 అనే సంస్థ దక్కించుకుంది. దీని గురించిన ఆన్లైన్ గేముల గురించి అలవాటు పడిన వారికి బాగా తెలుసు. టాటా,పతంజలి, బైజులాంటి సంస్థలు పోటీ పడినట్లుగా ప్రచారం జరిగినా..చివరికి ఊరూపేరూ లేని డ్రీమ్11 సంస్థ హక్కులను చేజిక్కించుకుంది. ఏడాదికి రూ.222 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. మిగిలిన దిగ్గజ సంస్థలు..రూ.రెండు వందల కోట్లలోపే బిడ్లను దాఖలు చేశాయి. అంతకు ముందు ఉన్న ఒప్పందం ప్రకారం.. వీవో ఏటా రూ.440 కోట్లకుపైగానే చెల్లించాల్సి ఉంది. వీవో తప్పుకోవడం వల్ల..రూ. 220 కోట్ల వరకూఐపీఎల్కు నష్టం వచ్చినట్లయింది.
అయితే.. ఐపీఎల్ నష్టం సంగతేమో కానీ.. అసలు డ్రీమ్ 11 సంస్థ ఏమిటి అన్న చర్చ ప్రారంభమయింది. బెట్టింగ్ కంపెనీ అని కొందరు … ఆన్ లైన్ గేమింగ్ కంపెనీ అని మరికొందరు చెబుతున్నారు.. అంతిమంగా ఆ సంస్థ.. ఆన్ లైన్ గేమ్స్‌ను మనీతో ఆడుకునేలా చేస్తుంది. దీని ద్వారా వందల కోట్ల ఆదాయాన్ని ఆ కంపెనీ అందుకుంటోందని.. అందుకే.. ఒక్క టైటిల్ స్పాన్సర్ షిప్కే రూ.222 కోట్లు పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. అయితే… ఈ వివాదం మాత్రమే కాదు.. అసలు డ్రీమ్ 11 సంస్థ వెనుక చైనా ఉందనే ప్రచారం ఊపందుకుంది. చైనాకు చెందిన టెన్సెంట్ అనే సంస్థ..వీడియో గేమింగ్ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. ఆ పెట్టుబడులు డ్రీమ్ 11 కంపెనీకి వచ్చాయని తెలుస్తోంది.
డ్రీమ్11కు ఆర్థిక వనరులను సమకూర్చిన సంస్థల్లో టెన్సెంట్ హోల్డింగ్స్ సంస్థ ఒకటి . చైనా మొబైల్ కంపెనీ వివో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి ఈ సీజన్ వరకూ తప్పుకోవడానికి కారణం చైనా కంపెనీ కావడమే. ఇప్పుడు ఓ చైనా కంపెనీ పోయి.. మరో చైనా కంపెనీ వచ్చినట్లయిందని..సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇప్పుడు బీసీసీఐ మళ్లీ కొత్త స్పాన్సర్ వేట కోసం వెళ్తుందో.. లేకపోతే.. విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకెళ్తుందో చూడాలి..!